ఉరి శిక్ష పడేలా ఎఫ్ఐఆర్ నమోదు చేయండి : రాధిక తండ్రి దీపక్
హర్యానా రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను తుపాకీ కాల్చి చంపిన ఆమె తండ్రి ఇపుడు పశ్చాత్తాపడుతున్నాడు. తాను చేసిన పనికి ఉరిశిక్ష పడేలా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రాధేయపడుతున్నారు. పైగా, ఆవేశంలో హత్య చేసిన దీపక్ ఇపుడు కుమిలిపోతున్నడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఈ ఘటనపై నిందితుడు దీపక్ సోదరుడు విజయ్ మీడియాతో మాట్లాడుతూ, "హత్య చేయడం చాలా పెద్ద తప్పిదం. దీపకన్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అరెస్టు చేశారు. ఆ సమయంలో అతడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. తనను ఉరితీసే విధంగా ఎఫ్ఎఆర్ రాయండని కూడా పోలీసులకు చెప్పాడు. ఆడపిల్లను చంపేశానని రోదించాడు" అని విజయ్ వెల్లడించారు.
కాగా దీపక్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీకి ఆదేశించారు. రాధికను తండ్రి దీపక్ హత్య చేయడానికి గల కారణాలు తెలియరాలేదు. తన సంపాదనపై ఆధారపడి బతుకుతున్నారంటూ కుమార్తె అవహేళన చేయడంతో తండ్రి హత్య చేసినట్లుగా మొదట వార్తలు వచ్చాయి.
అయితే ఆ కుటుంబంతో పరిచయం ఉన్న వారు మాత్రం ఈ వాదనను కొట్టి పారేస్తున్నారు. రాధిక గత ఏడాది ఒక కళాకారుడితో కలిసి రీల్స్ చేసింది. ఇది వారి కుటుంబంలో చిచ్చు పెట్టినట్లుగా మరో కథనం ఉంది.