గౌతం గంభీర్ అలాంటి వాడు కాడు.. మద్దతు పలికిన భజ్జీ, లక్ష్మణ్
ఈస్ట్ ఢిల్లీ ఆమాద్మీ పార్టీ అభ్యర్థి అతిషిపై అభ్యంతరకర వ్యాఖ్యలతో కరపత్రాలు పంపిణీ చేసిన వ్యవహారంలో టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్‌కు కొత్త చిక్కొచ్చిపడింది. ఈస్ట్ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ తనపై అసభ్య పదజాలంతో కరపత్రాలు ముద్రించి పంచారంటూ అతిషి గురువారం ఆరోపించిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదనీ... తనపై చేస్తున్న నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటానని గంభీర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. బహిరంగంగా ఆత్మహత్య చేసుకునేందుకు కూడా సిద్ధమని సవాల్ విసిరారు. నిజం కాదని తేలితే ఆప్ చీఫ్ కేజ్రీవాల్ రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్‌కు అండగా మాజీ క్రికెటర్ నిలిచారు.
అతిషిపై కర పత్రాల పంపిణీ విషయంలో మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్ భజ్జీలు గంభీర్‌కు మద్దతుగా నిలిచారు. ఈ వ్యవహారంపై లక్ష్మణ్, భజ్జీ మాట్లాడుతూ.. గంభీర్‌ను తమకు 20 సంవత్సరాలుగా తెలుసునన్నారు.
గంభీర్ నిజాయితీ పరుడు, మహిళలపై గౌరవం కలవాడు. గంభీర్ ఎన్నికల్లో గెలుస్తాడా, ఓడిపోతాడా అనే విషయాన్ని పక్కనబెడితే.. మహిళల పట్ల గంభీర్ మర్యాదపరంగా ప్రవర్తిస్తాడని చెప్పారు. గంభీర్ ఇప్పటివరకు అమ్మాయిల గురించి అభ్యంతరకరంగా మాట్లాడిన దాఖలాలు లేవని వెల్లడించారు.