బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : నెదర్లాండ్స్‌పై బంగ్లా విజయం.. సూపర్-8 ఆశలు పదిలం

icc t20 world cup
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలోభాగంగా, గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు నెదర్లాండ్స్ జట్టుపై విజయభేరీ మోగించింది. దీంతో బంగ్లాదేశ్ తన సూపర్-8 ఆశలను మరింతగా మెరుగుపరుచుకుంది. గ్రూపు-డిలో తమకు పోటీగా ఉన్న నెదర్లాండ్స్‌పై బంగ్లా ఆటగాళ్లు 25 పరుగుల తేడాతో గెలుపొందారు. ప్రస్తుతం నాలుగు పాయింట్లో ఉన్న ఈ జట్టు తన చివరి మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనుంది. 
 
ఇదిలావుంటే, గురువారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా జట్టులో ఆటగాడు షకీబ్ అల్ హాసన్ 46 బంతుల్లో 9 ఫోర్లతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పేసర్‌ రిషాద్‌ హొస్సేన్‌ (3/33) కీలక వికెట్లతో దెబ్బతీశాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. తన్‌జీద్‌ హసన్‌ (35), మహ్ముదుల్లా (25) రాణించారు. వాన్‌ మీకెరెన్‌, ఆర్యన్‌ దత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేసి ఓడింది. ఏంజెల్‌బ్రెట్‌ (33), విక్రమ్‌జిత్‌ (26), ఎడ్వర్డ్స్‌ (25) ఫర్వాలేదనిపించారు. టస్కిన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా షకీబ్‌ నిలిచాడు.
 
ఆ తర్వాత 135 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు ఆరంభంలో ఆ జట్టు ఆటగాళ్ళ ఆటతీరు బాగానే ఉన్నప్పటికీ చివరి ఆరు ఓవర్లలో తడబాటు దెబ్బతీసింది. పవర్‌ ప్లేలో ఓపెనర్లు లెవిట్‌ (18), ఓడౌడ్‌ (12) వికెట్లను కోల్పోగా, విక్రమ్‌జిత్‌ ఉన్నకాసేపు వేగం చూపుతూ మూడు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. ఏంజెల్‌బ్రెట్‌తో తను మూడో వికెట్‌కు 37 పరుగులు అందించాడు. ఆ తర్వాత కెప్టెన్‌ ఎడ్వర్డ్స్‌, ఏంజెల్‌ బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కోవడంతో జట్టు విజయం వైపు వెళ్తున్నట్టనిపించింది. 14వ ఓవర్‌ వరకు సజావుగా సాగిన డచ్‌ ఛేజింగ్‌ ఆ తర్వాత పూర్తిగా తడబడింది. 15వ ఓవర్‌లో ఏంజెల్‌బ్రెట్‌, బాస్‌ డి లీడ్‌ (0)లను రిషాద్‌ అవుట్‌ చేయడంతో మరిక కోలుకోలేకపోయింది. దీంతో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది.