కోహ్లీలా డకౌట్ అవుతారు జాగ్రత్త: ప్రజలకు ఉత్తరాఖండ్ పోలీసులు వార్నింగ్, ఎందుకు?
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పోలీసులు భలే వాడుకుంటున్నారు. ఇంగ్లండ్‌తో శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. కోహ్లీ పరుగులేమీ చేయకుండా ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే పెవిలియన్ బాట పట్టాడు.
ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో మిడాఫ్ దిశగా బౌండరీ కొట్టేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బంతి నేరుగా వెళ్లి క్రిస్ జోర్డాన్ చేతుల్లో పడింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కోహ్లీ నిర్లక్ష్యంగా ఆడాడని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ డకౌట్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు భలే వాడుకుంటున్నారు.
"హెల్మెట్ పెట్టుకోవడం ఒకటే కాదు.. బాధ్యతాయుతంగా ఉండాలి. లేకపోతే కోహ్లీలా డకౌట్ అవుతారు" అంటూ ఉత్తరాఖండ్ పోలీస్ విభాగం చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ అవుట్‌ను ప్రస్తావిస్తూ ఉత్తరాఖండ్ పోలీసు విభాగం రోడ్డు ప్రమాదాలపై ట్వీట్ చేసింది. 'హెల్మెట్ ఒక్కటే సరిపోదు.. చాలా ఏకాగ్రతగా డ్రైవింగ్ చేయాలి. లేకపోతే కోహ్లీలా మీరు మీ జీవితంలో డకౌట్ అవుతార'ని పేర్కొంది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అవమానించేలా ఉన్న ఈ ట్వీట్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ట్వీట్‌పై విమర్శలు రావడంతో.. `కోహ్లిని కించపరచడం మా ఉద్దేశం కాదు. కేవలం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలనే ఇలా చేశామ`ని తమ చర్యను ఉత్తరాఖండ్ పోలీసులు సమర్థించుకున్నారు.