శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (11:31 IST)

ఉత్తరాఖండ్ జలప్రళయంలో మిస్సింగ్ ఉద్యోగులంతా చనిపోయినట్టే..

ఈ నెల 7వ తేదీ ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని చమోలీలో జలప్రళయం సంభవించింది. ఈ జల ప్రళయంలో అనేక మంది ఉద్యోగులు మిస్సింగ్ అయ్యారు. వీరిలో 68 మంది చనిపోయినట్టు గుర్తించారు. ఇంతవరకు జాడతెలియని మరో 136 మందిని "చనిపోయినట్టుగానే భావిస్తున్నట్టు" ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి అమిత్ సింగ్ వెల్లడించారు.

సాధారణంగా ఏదైనా ఘటనలో ఎవరైనా అదృశ్యమై, ఏడేళ్ల వరకు వారి జాడ తెలియకపోతే అప్పుడు వారు మరణించినట్టు ధ్రువీకరిస్తారు. అయితే, ఉత్తరాఖండ్ విపత్తుకు ఇది వర్తించదని అమిత్ సింగ్ వివరణ ఇచ్చారు. కాబట్టి మరణించినట్టు భావిస్తున్న వారి కుటుంబాలకు నష్టపరిహారం పంపిణీ, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు తెలిపారు.

ఇందుకోసం గల్లంతైన వారిని మూడు కేటగిరీలుగా విభజించినట్టు చెప్పారు. దుర్ఘటన జరిగిన ప్రాంతం సమీపంలో గల్లంతైన ప్రజలను మొదటి కేటగిరీలో చేర్చగా, విపత్తు సంభవించిన ప్రాంతం వద్ద ఉండి గల్లంతైన ఇతర జిల్లాలకు చెందిన వారిని రెండో కేటగిరీలో చేర్చారు. మూడో విభాగంలో పర్యాటకులను చేర్చారు.

వీరికి సంబంధించిన వివరాలను ప్రకటనల రూపంలో ఇస్తారు. నెల రోజుల తర్వాత కూడా ఎలాంటి అభ్యంతరాలు రాకుంటే అప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. అనంతరం నష్టపరిహారం పంపిణీ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, హిమాలయా శ్రేణుల నుంచి ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడటంతో ఈ జలప్రళయం సంభవించిన విషయం తెల్సిందే.