న్యూజిలాండ్‌కు రాయుడు - పాండ్యా పంచ్ : ఆల్‌రౌండ్ షోతో భారత్ విజయభేరీ

team india
Last Updated: ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (15:28 IST)
హైదరాబాద్ కుర్రోడు అంబటి రాయుడు పంచ్‌కు న్యూజిలాండ్ జట్టు కుదేలైపోయింది. దీనికితోడు భారత బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో చివరి వన్డే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు విజయభేరీ మోగించింది. ఫలితంగా ఐదు వన్డేల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ వన్డే సిరీస్‌లో ఒక్క మూడో వన్డేలో మాత్రం భారత్ చెత్త ప్రదర్శన చూపింది. మిగిలిన నాలుగు వన్డేలో ఆల్‌రౌడ్ ప్రదర్శనతో కివీస్ గడ్డపై చరిత్ర సృష్టించింది. అదేసమయంలో ఈ వన్డే సిరీస్‌ను భారత్ విజయానందంతో ముగించింది.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసింది. ఒక దశలో 18 పరుగులకే నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయిన సమయంలో అంబటి రాయుడు, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. ముఖ్యంగా రాయుడు బాధ్యతాయుత ఇన్నింగ్స్, ఆకర్లో పాండ్యా మెరుపులతో టీమిండియా 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. భారత జట్టులో టాప్ ఆర్డర్ కుప్పకూలినప్పటికీ.. మిడిల్ ఆర్డర్ ఆదుకుంది. తీవ్రమైన ఒత్తిడిలోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. అంబటి రాయుడుతో పాటు... హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్‌లు సత్తా చాటడంతో భారత్ 252 పరుగులు చేయగలిగిలింది.

రాయుడు 113 బంతుల్లో 4 సిక్స్‌లు, 8 ఫోర్లతో 90 పరుగులు చేయగా.. చివర్లో పరుగుల సునామీ సృష్టించిన పాండ్యా కేవలం 22 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అందులో 5 సిక్స్‌లు, 2 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇద్దరికీ తోడుగా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ నిలిచాడు. విజయ్ 64 బంతుల్లో 4 ఫోర్లతో 45 పరుగులు చేయడంతో భారత్.. ప్రత్యర్థి ముంగిట ఛాలెంజింగ్ స్కోరును ఉంచింది. అంతకుముందు టీమిండియా ప్రధాన బ్యాట్స్‌మెన్ రోహిత్ (2), ధావన్ (6), శుభ్‌మాన్ గిల్ (7), ధోనీ (1) దారుణంగా విఫలమయ్యారు.

ఆ తర్వాత 253 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య కివీస్ జట్టు.. వరుస వికెట్లు కోల్పోయింది. నీషమ్ 44 పరుగులు, లాథమ్ 37 పరుగులు, కేన్ విలియంసన్ 39 పరుగులు, మున్రో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేకపోవడంతో 44.1 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. చాహాల్‌కు మూడు వికెట్లు దక్కగా, మహ్మద్ షమీకి 2, హార్దిక్ పాండ్యాకు రెండు వికెట్లు దక్కాయి. జాదవ్, భువనేశ్వర్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు. ఐదు వన్డేల సిరీస్ 4-1 తేడాతో సొంతం చేసుకుంది టీమిండియా.దీనిపై మరింత చదవండి :