హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ఇండో - పాక్ మ్యాచ్ టిక్కెట్లు (video)
ఐసీసీ ప్రపంచ క్రికెట్ టోర్నీలో భాగంగా జూన్ 16వ తేదీన భారత్ - పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్ జరుగుతుందో లేదో తెలియదు. కానీ, ఈ మ్యాచ్ టిక్కెట్లు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు మొదలు పెట్టిన 48 గంటల్లోనే అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని టోర్నీ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు, పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఇండియా మ్యాచ్ ఆడకూడదనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి.
దీంతో, ఈ మ్యాచ్ జరుగుతుందో, లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ, క్రికెట్ ప్రేమికులు మాత్రం దీన్నేమీ పట్టించుకోకుండా... టికెట్లను సొంతం చేసుకున్నారు. మరోవైపు, భారత్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఇది మరోమారు నిరూపించింది.
కాగా, ఐసీసీ నిర్వహించే ప్రధాన ఈవెంట్లలో భారత్ పాకిస్థాన్ జట్లు పలు సందర్భాల్లో తలపడ్డాయి. కానీ, ఇప్పటివరకు పాకిస్థాన్ జట్టు మాత్రం విజయం సాధించలేదు. దీంతో ఇరు జట్లు ఆడే మ్యాచ్‌లు అంటే క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది.