గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 నవంబరు 2019 (12:11 IST)

ఇండోర్ టెస్ట్ : లంచ్ విరామానికి బంగ్లా స్కోరు 63/3

ఇండోర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య తొలి టెస్టు గురువారం ప్రారంభమైంది. ఈ టెస్టులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు లంచ్ విరామ సమయానికి 26 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి, 63 పరుగులు సాధించింది. కెప్టెన్ మొమినల్ హక్ (22), ముష్ఫికర్ రహీమ్ (14) క్రీజులో ఉన్నారు. 
 
కీలకమైన బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్‌కు లైఫ్ లభించింది. ఉమేష్ బౌలింగ్‌లో రెండో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ కోహ్లి అతని క్యాచ్‌ని జారవిడిచాడు. దీంతో, ఊపిరి పీల్చుకున్న ముష్ఫికర్ జాగ్రత్తగా ఆడుతున్నాడు. భారత పేసర్లు ఉమేష్, ఇషాంత్, షమీ తలో వికెట్ పడగొట్టారు.
 
అంతకుముందు.. టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ మొమినుల్ హక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా బంగ్లా కెప్టెన్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయాలని టీమ్ యాజమాన్యం అంతా నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈ పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమన్నాడు. ప్రపంచస్థాయి బౌలర్లను ఎదుర్కొనేందుకు సన్నద్దమయ్యామని మొమినుల్ తెలిపాడు. 
 
మైదానంలో కాస్త తేమ ఉండడంతో మొదటి రెండు గంటలు బౌలర్లకు ఇబ్బంది కలగవచ్చు. కాగా, బంగ్లా కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతోంది. షకీబ్ నిషేదానికి గురైన విషయం తెలిసిందే. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ సైతం గాయం కారణంగా కీలక సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో, బంగ్లా బ్యాటింగ్ విభాగం కాస్త కలవరపడుతోందని చెప్పొచ్చు.