వెస్టిండీస్‌తో తొలి టెస్టు: 50 వికెట్లతో బుమ్రా.. సెంచరీతో కేఎల్ రాహుల్ రికార్డులు
వెస్టిండీస్‌తో అహ్మదాబాద్ వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా బుమ్రా రికార్డ్ సృష్టించాడు. టెస్ట్‌ల్లో సొంతగడ్డపై అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా జవగళ్ శ్రీనాథ్‌తో సమంగా బుమ్రా నిలిచాడు. ఈ క్రమంలో అతను కపిల్ దేవ్ రికార్డ్‌ను అధిగమించాడు.
బుమ్రా, జవగళ్ శ్రీనాథ్ 24 ఇన్నింగ్స్‌ల్లో సొంతగడ్డపై 50 టెస్ట్ వికెట్లు సాధించారు. కపిల్ దేవ్ 25 ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను అందుకున్నాడు. అయితే సొంతగడ్డపై బుమ్రాదే అత్యుత్తమ యావరేజ్ కావడం విశేషం. అలాగే డబ్ల్యూటీసీ చరిత్రలో 200 వికెట్ల మైలురాయి అందుకునేందుకు బుమ్రా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అతను 173 వికెట్లతో నిలిచాడు. డబ్ల్యూటీసీ 2027 ఎడిషన్‌లో అతను ఈ మైలురాయి అందుకునే అవకాశం ఉంది.
మ్యాచ్ సంగతికి వస్తే..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. వెస్టిండీస్ బ్యాటర్లలో జస్టిన్ గ్రీవ్స్(48 బంతుల్లో 4 ఫోర్లతో 32), షైహోప్(36 బంతుల్లో 3 ఫోర్లతో 26), రోస్టన్ ఛేజ్(43 బంతుల్లో 4 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కింది. భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ ఇన్నింగ్స్ రెండు సెషన్లలోనే ముగిసింది.
అలాగే అహ్మదాబాద్ టెస్ట్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి కేఎల్ రాహుల్ 114 బంతుల్లో 6 బౌండరీలతో 53 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రెండో రోజు ఆటలోనూ అద్భుతంగా ఆడిన కేఎల్ రాహుల్, తన కెరీర్‌లో 11వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
ఇంకా ఈ తొలి టెస్ట్ మ్యాచ్‌లో నిలకడగా రాణించడం ద్వారా 2025లో టెస్ట్ క్రికెట్లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొత్త మైలురాయిని చేరుకున్నాడు. ఈ సెంచరీతో కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్‌కు చెందిన బెన్ డకెట్‌ను వెనక్కి నెట్టేశాడు.