మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (07:53 IST)

బెంగుళూరు అట్టర్ ప్లాఫ్ : కోల్‌కతా ఘన విజయం

ఐపీఎల్ 14 రెండో దశ పోటీలు దుబాయ్ వేదికగా ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభ మ్యాచ్‌లో ఎప్పటిలా చెన్నై సూపర్ కింగ్స్ విజయభేరీ మోగించింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి అబుదాబిలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఘన విజయం సాధించింది. 
 
ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సేన నిర్దేశించిన 93 పరుగుల విజయ లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి సగం ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ 48, వెంకటేశ్ అయ్యర్ 41(నాటౌట్) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. 
 
అంతకుముందు.. ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కోల్‌కతా బౌలర్ల దెబ్బకు ఆర్సీబీ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. 19 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌట్ అయింది.వరుణ్ చక్రవర్తి, రసెల్ పోటీలు పడి వికెట్లు తీశారు. దీంతో బెంగళూరు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 
 
ఐదు పరుగులు మాత్రమే చేసి కెప్టెన్ కోహ్లీ అవుట్ కాగా, ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ (22), శ్రీకర్ భరత్ (16) కలిసి కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 31 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. జట్టులో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. అంతేకాదు వీరిద్దరు చేసిన పరుగులే అత్యధికం.
 
ముఖ్యంగా, ఆదుకుంటారనుకున్న డివిలియర్స్, అరంగేట్ర ఆటగాడు హసరంగా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. మ్యాక్స్‌వెల్ 10, హర్షల్ పటేల్ 12 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ కనీసం పది పరుగులు కూడా చేయలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రసెల్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, ఫెర్గ్యూసన్ 2, ప్రసీద్ ఒక వికెట్ తీసుకున్నాడు. 
 
మూడు వికెట్లు తీసి బెంగళూరు పరాజయాన్ని శాసించిన వరుణ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఇదిలావుంటే, ఐపీఎల్‌లో నేడు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.