బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (15:44 IST)

ధోనీతో తలపడనున్న కోహ్లీ... పోరులో ఎవరు గెలుస్తారు?

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీలు నువ్వానేనా అంటూ తలపడనున్నారు. ఈ పోరులో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఇంతకీ వీరిద్దరు ఎందుకు తలపడనున్నారనే కదా మీ సందేహం. 
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 పోటీల షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. మొత్తం షెడ్యూల్ ప్రకటించకుండా కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే వెల్లడించింది. మొదటి మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడనున్నాయి. వచ్చే నెల 23వ తేదీ నుంచి ఈ టోర్నీ ప్రారంభంకానుంది. 
 
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రం బోర్డు విడుదల చేసింది. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగతా షెడ్యూల్‌ను లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐపీఎల్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్ త‌న తొలి మ్యాచ్‌ను మార్చి 24న కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఆడ‌నుంది. ఇక హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియంలో మార్చి 29న ఈ సీజ‌న్ తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్‌తో స‌న్‌రైజ‌ర్స్ త‌ల‌ప‌డ‌నుంది.