ఆదివారం, 26 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 21 మే 2017 (11:57 IST)

నేడు ఉప్పల్‌లో ఐపీఎల్‌-10 ఫైనల్‌ : పుణె-ముంబై అమీతుమీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో అంచె పోటీల్లోభాగంగా ఫైనల్ పోటీ ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ ఫైనల్ పోరుతో ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణె జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్ల బలాబలాలను పరిశీలిస్తే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో అంచె పోటీల్లోభాగంగా ఫైనల్ పోటీ ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ ఫైనల్ పోరుతో ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణె జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్ల బలాబలాలను పరిశీలిస్తే.. ఐపీఎల్‌ టోర్నీలోనే అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఒకటైతే.. గత సీజనలో చెత్తగా ఆడి ఈ సారి అదరగొట్టిన జట్టు పుణె. రెండూ మరాఠా జట్లే. అద్భుత ఆటతో ఫైనల్‌కు దూసుకొచ్చిన ఈ రెండూ ఇప్పుడు టైటిల్‌ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. 
 
భాగ్యనగరం తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న మెగా ఫైనల్లో కొదమసింహాల్లా తలపడేందుకు రె‘ఢీ’ అంటున్నాయి. బ్యాటింగ్‌.. బౌలింగ్‌.. అన్నింటా సమఉజ్జీలుగా కనిపిస్తున్న ఈ రెండు జట్లలో ఫేవరెట్‌ ఎవరో చెప్పలేం. బరిలోకి దిగి బాదినోడే బాద్‌షా. వికెట్లు పడగొట్టినోడే వీరుడు. ఆఖరాటలో అదరగొట్టిన జట్టుకే పట్టాభిషేకం. మరి, ముంబై మూడోసారి టైటిల్‌ నెగ్గి రికార్డు సృష్టిస్తుందా? పుణె ట్రోఫీతో తన ప్రస్థానాన్ని ముగిస్తుందా? ధనాధన్ లీగ్‌ దశాబ్దపు సమరంలో విజయ ‘దశ’మి ఎవరిదో నేడే తేలనుంది. 
 
అయితే, లీగ్‌లో పుణె చేతిలో మూడుసార్లు ఓడినప్పటికీ.. ముంబైని ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. నాలుగోసారి ఫైనల్‌ ఆడుతున్న ఆ జట్టులో ఎంతో మంది అనుభవజ్ఞులు ఉన్నారు. మరోవైపు అంచనాలే లేకుండా బరిలోకి దిగి అద్భుత ఆటతో తుదిపోరుకు దూసుకొచ్చింది పుణె. అత్యధిక ఫైనల్స్‌ ఆడిన ధోనీ.. కెప్టెన్ స్మిత్‌కు, జట్టుకు వెన్నంటి నిలువగా.. సూపర్‌జెయింట్‌కు తిరుగే లేకుండా పోయింది. దాంతో మెగా ఫైట్‌లో హోరాహోరీ పోరాటం తప్పదనిపిస్తోంది.
 
ఫేవరెట్‌గా సీజనను ఆరంభించిన ముంబై అందుకు తగ్గ ఆటతీరుతో అలరించింది. ఆఖర్లో కాస్త కంగారు పడినా మూడో టైటిల్‌ కొల్లగొట్టి టోర్నీలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు సృష్టించేందుకు ఒకే అడుగు దూరంలో నిలించింది. 
 
జట్లు (అంచనా)
పుణె: త్రిపాఠి, రహానె, స్టీవ్‌ స్మిత్ (కెప్టెన), మనోజ్‌, ధోనీ (కీపర్‌), క్రిస్టియన్, ఉనాద్కట్‌, జంపా, సుందర్‌, ఫెర్గ్యూసన్, శార్దూల్‌.
 
ముంబై: సిమన్స్, పార్థివ్‌ (కీపర్‌), రాయుడు, రోహిత్ (కెప్టెన్‌), క్రునాల్‌, పొలార్డ్‌, హార్దిక్‌, కర్ణ్‌ శర్మ, జాన్సన్/మెక్లెనగన్, మలింగ, బుమ్రా.