టీమిండియా హెడ్ కోచ్‌గా మళ్లీ #RaviShastri: టీ-20 ప్రపంచకప్ దక్కేనా?
టీమిండియా హెడ్ కోచ్ పదవి మళ్లీ రవిశాస్త్రికే దక్కింది. కపిల్ దేవ్ నాయకత్వంలోని అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో తదుపరి కోచ్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ ఇంటర్వ్యూల్లో క్రికెట్ సలహా కమిటీ మళ్లీ రవిశాస్త్రికే పట్టం కట్టింది. కెప్టెన్ కోహ్లీ బహిరంగంగానే రవిశాస్త్రికి తన మద్దతు ప్రకటించడంతో.. రవిశాస్త్రికి మళ్లీ కోచ్ పదవి వరించింది.
ఇక కొత్త కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతాడు. అలాగే భారత్ ఆతిథ్యమిచ్చే 2021 ట్వంటీ-20 ప్రపంచ కప్ వరకు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఈ సందర్భంగా కపిల్‌దేవ్ మాట్లాడుతూ భారత ఆటగాళ్లపైన, ఇతర అన్ని అంశాలపై రవిశాస్త్రికి పూర్తి అవగాహన ఉందని తెలిపారు.
కాగా, రవిశాస్త్రి కోచ్ సారథ్యంలోనే ఇంగ్లండ్ గడ్డపై జరిగిన వన్డే ప్రపంచ కప్‌ను భారత్ కోల్పోయింది. ఇక రెండేళ్ల పాటు కొనసాగే రవిశాస్త్రి, టీ-20 ప్రపంచ కప్‌నైనా సంపాదించిపెడతాడో లేదో అనేది వేచి చూడాలి.