శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2019 (19:12 IST)

ఆర్థికమాంద్యం ముంచుకొస్తోంది.. (video)

ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. 2008-09 సంవత్సరంలో అమెరికా వంటి అగ్రరాజ్యాన్నే గడగడలాడించిన ఈ ఆర్థిక మాంద్యం.. మళ్లీ ప్రపంచ దేశాలను పలకరించనుందని వార్తలు వస్తున్నాయి. అది కూడా మరో తొమ్మిది నెలల్లో ఈ ఉపద్రవం ప్రపంచాన్ని ముంచెత్తుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
ఇందుకు తగిన సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. భారత్‌లో బంగారం ధర ఆకాశాన్ని అంటోంది.  వాహనరంగం సహా పలు రంగాల్లో అమ్మకాలు తగ్గిపోతున్నాయి. స్టాక్‌మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఇవన్నీ మన దేశం కూడా ఆర్థికమాంద్యానికి దగ్గరవుతోందనడానికి సంకేతాలేనని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
 
జనం ఏ మాత్రం కొనుగోళ్లకు తొందరపడటం లేదు. ఖరీదైన వస్తువులను కొనుగోళు చేసేందుకు ముందడుగు వేయట్లేదు. దీంతో అమ్మకాలు క్షీణిస్తున్నారు. దీనికితోడు పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు చెబుతున్న విషయాలు చూస్తే మున్ముందు ఇంకా పతనావస్థ ఉందనే అభిప్రాయం కలగక మానదు. దీనివల్ల కొత్త ఉద్యోగాలు లేకపోగా ఉన్న ఉద్యోగాలకే ఎసరొస్తుంది.
 
అసలు ఈ ఆర్థిక మాంద్యం ఎందుకు వస్తుంది. వరుసగా రెండు త్రైమాసికాల పాటు ఉత్పత్తి పడిపోతే మాంద్యం మొదలైనట్టేనని వారు చెప్తున్నారు. దీనికితోడు ఉద్యోగాలు తగ్గిపోయి చమురు డిమాండ్ తగ్గిందంటే.. మాంద్యం వస్తున్న సంకేతాలు కనిపించినట్టే.
 
ఒకవేళ ఆర్థిక మాంద్యం ఏర్పడితే అంతర్జాతీయ వృద్ధిరేటు పడిపోతుంది. ఉద్యోగాల్లో కోత తప్పదు. ఉన్న ఉద్యోగస్తులకు జీతాలు తగ్గిపోతాయి. 2008లో ఆర్థిక మాంద్యానికి అమెరికా సబ్ ప్రైమ్ ప్రధాన కారణమైతే.. ఈసారి ఆర్థిక మాంద్యానికి అమెరికా- చైనా మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం కారణమవుతుందని భావిస్తున్నారు. 
 
ఈ రెండు దేశాలూ ప్రస్తుతం ఇతర దేశాల వస్తువులపై టాక్సులు పెంచుతున్నాయి. ఇదే కొనసాగితే... మరికొన్ని నెలల్లో ఆర్థిక మాంద్యం రావడం ఖాయంగా కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు వెల్లడిస్తున్నారు.