శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 జనవరి 2020 (11:53 IST)

రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ.. అదరగొట్టిన మనోజ్ తివారీ.. నాటౌట్

రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ నమోదైంది. బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారీ తన బ్యాటుకు పనిచెప్పి విజృంభించాడు. త్రిశతకంతో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. పశ్చిమ బెంగాల్-హైదరాబాదుల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 414 బంతులు ఎదుర్కొన్న తివారీ 303 పరుగులు చేయడమేకాక నాటౌట్‌గా నిలిచాడు. తివారీ ఇన్నింగ్స్ లో 30 బౌండరీలు, 5 సిక్సర్లున్నాయి. 
 
పశ్చిమబెంగాల్ లోని బెంగాల్ క్రికెట్ మైదానం వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బెంగాల్ జట్టు సోమవారం కూడా బ్యాటింగ్ చేసి ఏడు వికెట్లకు 635 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. నాలుగో బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి దిగిన తివారీ ఆదివారం మ్యాచ్‌లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 
 
రెండో రోజైన సోమవారం ఆటలో రెండు సెంచరీలతో ట్రిపుల్ సెంచరీని సాధించాడు. కాగా మనోజ్ తివారీ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. భారత జట్టు తరపున 12 వన్డేలు, మూడీ టీ-20 మ్యాచ్‌లు ఆడాడు.