పాక్ క్రికెటర్లు మటన్ తిండిబోతులన్న అక్రమ్: ఆన్‌లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్న పాక్ టీమ్
వరుస ఓటములతో పాకిస్తాన్ బాబర్ సేన బెంబేలెత్తిపోతోంది. ఏ జట్టు చూసినా బాదుడే బాదుడు. తొలుత రెండు మ్యాచుల్లో విజయం సాధించిన పాకిస్తాన్ మూడో మ్యాచ్ భారత్ తో ప్రారంభించిన దగ్గర్నుంచి ఓటముల తప్ప ఒక్క విజయం కూడా దక్కలేదు. ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు చేతుల్లో కూడా ఘోరంగా ఓడిపోయింది. దీనితో ఆ జట్టుపై పాకిస్తాన్ దేశంలోని క్రీడాకారులు, సీనియర్ ఆటగాళ్లు విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు.
పాక్ సీనియర్ ఆటగాడు వసీం అక్రమ్ అయితే... రోజుకి ఒక్కొక్క ఆటగాడు 8 కిలోల మటన్ లాగించేస్తుంటే వారి ఆటతీరు ఇలా వుండక ఎలా వుంటుంది అని ఘాటు వ్యాఖ్యలు చేసాడు. దీనితో హర్ట్ అయ్యారో ఏమో తెలియదు కానీ బాబర్ సేన ఆదివారం నుంచి తాము బస చేసిన హోటల్ లోని వంటకాలు తినకుండా ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటున్నారట.
తాము కిలోలకొద్దీ మటన్ తినడం లేదని ఇలా చెప్పదల్చుకున్నారేమో మరి. మరోవైపు నేడు బంగ్లాదేశ్ జట్టుతో పాకిస్తాన్ తలపడబోతోంది. రానున్న మ్యాచులన్నింటిలో ఆ జట్టు విజయం సాధిస్తేనే సమీఫైనల్ అవకాశాలుంటాయి. లేదంటే ఇంటికి దారిపట్టాల్సిందే.