గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 అక్టోబరు 2019 (16:40 IST)

రాంచి టెస్ట్ : ఉమేష్ సిక్సర్ల్ మెరుపులు... భారత్ స్కోరు 497/9 డిక్లేర్డ్

రాంచి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 497 పరుగులు చేసింది. ఈ స్కోరు వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీతోనూ, రహానే సెంచరీతో రాణించగా, ఆఖర్లో ఉమేష్ యాదవ్ బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు. ఫలితంగా 9 వికెట్ల నష్టానికి 497 పరుగులు చేసింది. 
 
రాంచి వేదికగా భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్‌ శనివారం నుంచి జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ 212 పరుగులు చేయగా, రహానే 115 పరుగులతో రాణించాడు. మ్యాచ్ ఆఖరులో బౌలర్ ఉమేష్ యాదవ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. 
 
కేవలం పది బంతుల్లో ఐదు సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. జడేజా కూడా 51 పరుగులు చేయగా, మయాంక్ అగర్వాల్ 10, పుజరా 0, కోహ్లీ 12, షా 24, అశ్విన్ 14, నదీమ్ 1 చొప్పున పరుగులు చేశారు. దీంతో 116.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 497 పరుగులు చేసింది. ఈ స్కోరు వద్దే కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేశాడు. 
 
ఇదిలావుంటే, ఉమేష్ యాదవ్.. కేవలం ఓ బౌలర్‌గానే కాకుండా, అవసరమైతే బ్యాట్‌తో కూడా రాణిస్తానని మరోమారు నిరూపించాడు. స్పెషలిస్టు బౌలరైన ఉమేశ్‌ యాదవ్‌.. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 10 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సిక్సర్లు ఉండగా, ఇది ఉమేశ్‌కు టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. 
 
ఉమేశ్‌ యాదవ్‌ వచ్చీ రావడంతోనే జార్జ్‌ లిండే వేసిన ఓవర్‌లో చివరి రెండు బంతుల్ని సిక్సర్లుగా కొట్టాడు. ఆపై మరొకసారి లిండే వేసిన ఓవర్‌లో మూడు సిక్సర్లు కొట్టాడు. దాంతో సిక్సర్ల రూపంలోనే 30 పరుగులు సాధించాడు. కాగా, ఈ క్రమంలోనే రెండు ఫాస్టెస్ట్‌ రికార్డుల్ని ఉమేశ్‌ యాదవ్‌ ఖాతాలో వేసుకున్నాడు.
 
30 పరుగుల్ని వేగవంతంగా సాధించిన జాబితాలో ఉమేశ్‌ టాప్‌లో నిలిచాడు. 9 బంతుల్లోనే ఉమేశ్‌ 30 పరుగులు చేశాడు. గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆటగాడు స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ 30 పరుగుల్ని 10 బంతుల్లో సాధిస్తే దాన్ని ఉమేశ్‌ బ్రేక్‌ చేశాడు. 
 
అలాగే, వేగవంతంగా 30కి పైగా పరుగులు సాధించిన జాబితాలో ఉమేశ్‌, ఫ్లెమింగ్‌ల తర్వాత వెస్టిండీస్‌ ఆటగాడు నామ్‌ మెక్లీన్స్ ‌(1998లో దక్షిణాఫ్రిపై 12 బంతుల్లో), అబ్దుల్‌ రజాక్‌ (2011లో జింబాబ్వేపై 17 బంతుల్లో)లు వరుస స్థానాల్లో ఉన్నారు. ఇక టెస్టు ఫార్మాట్‌ చరిత్రలో 10 బంతులు, ఆపై ఆడిన అత్యధిక స్ట్రైక్‌రేట్‌ కలిగిన ఆటగాళ్లలో ఉమేశ్‌ అగ్రస్థానంలో నిలిచాడు. 
 
ఇక్కడ ఉమేశ్‌ యాదవ్‌ 310 స్టైక్‌రేట్‌తో టాప్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత ఫ్లెమింగ్‌ 281.81 స్టైక్‌రేట్‌తో రెండో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 497/9 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేయగా, ఆపై ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన సఫారీలు 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయారు.డీన్‌ ఎల్గర్‌ను షమీ ఔట్‌ చేస్తే, డీకాక్‌ను ఉమేశ్‌ యాదవ్‌ పెవిలియన్‌కు పంపించాడు.