మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 అక్టోబరు 2019 (15:05 IST)

రోహిత్ ద్విశతకంతో ఆరు దశాబ్దాల రికార్డు బద్ధలు

టెస్ట్ ఫార్మెట్‌కు పనికిరావని అవమానించిన వారికి భారత క్రికెట్ జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ తన బ్యాటుతోనే సమాధానం చెబుతున్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. తొలి టెస్టులో డబుల్ సెంచరీ బాదిన రోహిత్.. రాంచి వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లోనూ మరోమారు బ్యాట్‌తో రాణించి ద్విశతకం సాధించాడు. తద్వారా 64 యేళ్ళ తర్వాత ఒకే సిరీస్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఘనతను భారత్ నమోదు చేసింది. 
 
గతంలో అంటే, 1955-56 సీజన్‌లో న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో మూడు డబుల్‌ సెంచరీలు నమోదయ్యాయి. ఆ సిరీస్‌లో వినోద్‌ మన్కడ్‌ రెండు డబుల్‌ సెంచరీలు సాధించగా, పాలీ ఉమ్ర్‌గర్‌ ద్విశతకం చేశాడు. ఆ సిరీస్‌ తర్వాత భారత్‌కు ఒకే సిరీస్‌లో మూడు డబుల్‌ సెంచరీలు రావడం ఇదే తొలిసారి. సఫారీలతో తొలి టెస్టులో మయాంక్‌ అగర్వాల్‌ డబుల్‌ సెంచరీ చేయగా, రెండో టెస్టులో విరాట్‌ కోహ్లి ద్విశతకం సాధించాడు. రాంచి టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ డబుల్‌ సెంచరీతో మెరిశాడు. తద్వారా మూడు వరుస టెస్టుల్లోనూ భారత్‌ ఆటగాళ్లు డబుల్‌ సెంచరీలు సాధించినట్లయ్యింది. ఇలా రావడం భారత్‌కు ఓవరాల్‌గా రెండోసారి మాత్రమే.
 
ఇదిలావుంటే, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తన బ్యాటింగ్‌లో సత్తా చాటుకుంటున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో ఓపెనర్‌గా పనికి రావన్న విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నాడు. ఇప్పటివరకూ ఈ సిరీస్‌లో రోహిత్‌ శర్మ 500కు పైగా పరుగులు సాధించాడు. దాంతో ఒక సిరీస్‌లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించిన ఐదో భారత్‌ ఓపెనర్‌గా అరుదైన ఘనతను నమోదు చేశాడు.
 
అంతకుముందు వినోద్‌ మన్కడ్‌, బుద్ధి కుందిరేన్‌, సునీల్‌ గావస్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌లు మాత్రమే ఒక టెస్టు సిరీస్‌లో 500 పైగా పరుగులు సాధించిన భారత ఓపెనర్లు కాగా, ఇప్పుడు వారి సరసన రోహిత్‌ చేరాడు. రాంచి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 180 పైగా పరుగులు సాధించిన తర్వాత రోహిత్‌ ఈ మార్కును చేరాడు.
 
తొలి టెస్టులోనే 303 పరుగులు సాధించిన రోహిత్‌.. రెండో టెస్టులో 14 పరుగులు చేశాడు. దాంతో ఒక్క సిరీస్‌లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించాడు. ఒక‌వైపు వికెట్స్ ప‌డుతున్న‌ప్ప‌టికి ఎంతో ఓపిక‌గా ఆడుతూ వ‌చ్చిన రోహిత్ శ‌ర్మ 248 బంతుల్లో డ‌బుల్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఇందులో 28 ఫోర్స్‌, 5 సిక్స్‌లు ఉన్నాయి.