రాంచీ టెస్ట్ మ్యాచ్ : రో'హిట్'.. మళ్లీ సెంచరీ బాదాడు
జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ శనివారం ప్రారంభమైంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలి మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ఇది రోహిత్ శర్మకు ఆరో టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం.
132 బంతుల్లో 101 పరుగులు చేశాడు. 95 పరుగుల దగ్గర సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయడం విశేషం. రోహిత్ ఈ ఇన్నింగ్సులో మొత్తం 13 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. టెస్టుల్లో అతనికిది ఆరో సెంచరీ, కాగా ఈ సీరిస్‌లోనే మూడు సెంచరీలు చేయడం మరో విశేషం.
కాగా, రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్‌లో రెండు వేల పరుగుల మైలురాయిని కూడా ఈ సిరీస్‌లోనే చేరుకున్నాడు. మరోవైపు రహానే కూడా అర్థసెంచరీ చేశాడు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో రోహిత్, రహానే నిలకడగా ఆడుతూ.. భారత్‌ను ఆదుకున్నారు.
భారత్ - సౌతాఫ్రికా క్రికెట్ జట్ల జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తరపున స్పిన్నర్ షాబాజ్ నదీమ్ తొలిసారి టెస్టుల్లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. గాయపడిన కల్దీప్ యాదవ్‌ను తుది జట్టులో నుంచి తొలగించి, స్థానిక కుర్రోడికి చోటు కల్పించారు.
ఇకపోతే, ఇప్పటికే రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన టీమిండియా ఈ టెస్ట్ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో స్థానిక క్రికెటర్ అయిన నదీమ్ షాబాజ్‌ను తుది జట్టులోకి ఎంపిక చేశారు.
ఈ కుర్రోడు ఇటీవల దేశవాళీ టోర్నీల్లో అత్యద్భుతంగా రాణించాడు. నదీమ్ టీమిండియా తరపున ఆడడం ఆనందంగా ఉందని కెప్టెన్ కోహ్లీ అన్నాడు. మూడో టెస్టులో ఇశాంత శర్మకు బ్రేక్ ఇచ్చారు. అలాగే, సౌతాఫ్రికా జట్టులో రెండు మార్పులు జరిగాయి. టెస్టుల్లో హెన్రిచ్ క్లాసెన్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జార్జ్ లిండే కూడా తొలి టెస్టు ఆడనున్నాడు.