శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2019 (18:06 IST)

భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్ జరుగుతుందా? గంగూలీ ఏమన్నాడు?

భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్‌ ఎప్పుడు జరుగుతుందోనని క్రికెట్ ఫ్యాన్స్ సందిగ్ధంలో వున్నారు. ముంబై పేలుళ్ల అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అలాగే క్రీడా సంబంధాలు కూడా సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో కాబోయే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్‌పై దాటవేశాడు. 
 
భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్‌ను అడగాలన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు, విదేశీ పర్యటనలు అంటే కచ్చితంగా ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. కాబట్టి, దానికి సమాధానం మా దగ్గరలేదు.. అంటూ గంగూలీ వ్యాఖ్యానించాడు. 
 
కాగా.. టీమిండియా పాకిస్తాన్ మధ్య 2012లో చివరి మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. రెండు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ కోసం పాకిస్తాన్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన సౌరవ్ గంగూలీ ఈనెల 23న బాధ్యతలు చేపట్టనున్నారు. 2004లో గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు పాకిస్తాన్‌లో పర్యటించింది. 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత జరిగిన తొలి సిరీస్ అదే. 
 
1989లో తొలిసారి భారత్ క్రికెట్ సిరీస్ కోసం పాకిస్తాన్‌లో పర్యటించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్న గంగూలీ భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్‌కు ప్రయత్నాలు చేస్తారా అనేదానిపై చర్చ జరిగింది. కానీ ఈ విషయంలో ప్రభుత్వాల అనుమతే ముఖ్యమని తేల్చేశారు.