మంగళవారం, 5 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2019 (11:32 IST)

కోపం వచ్చినా.. ఆ టాలెంట్ నాకుంది.. ధోనీ

రిటైర్మెంట్‌పై పలు విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. అందరూ క్రికెటర్ల తరహాలోనే మైదానంలో తనకూ కోపం, అసహనం వస్తాయని తెలుపుతున్నాడు. కానీ భావోద్వేగాలను తాను నియంత్రించుకోగలనని తెలిపాడు. మైదానంలో కోపం, అసహనం కలిగేవి. కానీ భావోద్వేగాల కంటే జట్టును ముందుకు నడిపించడమే ముఖ్యమనిపించేదని ధోనీ చెప్పుకొచ్చాడు. 
 
భావోద్వేగాలను అధిగమించి మ్యాచ్‌పై దృష్టి సారిస్తాను. తర్వాత బంతిని ఎవరికి అందివ్వాలి? బరిలోకి ఎవరిని దించాలి? అనే వాటి గురించి ఆలోచనలో ఉంటానని చెప్పాడు. ఆ తర్వాత భావోద్వేగాల గురించి తాను మర్చిపోతానని ధోనీ చెప్పుకొచ్చాడు. 
 
ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్‌లో ఆడిన ధోనీ.. ఆ తర్వాత క్రికెట్​కు తాత్కాలిక విరామం పలికిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వెస్టిండీస్ పర్యటనకు, దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. కానీ డిసెంబరులో తిరిగి ధోనీ మైదానంలోకి అడుగుపెడతాడని తెలుస్తోంది.
 
ఇదిలా ఉంటే.. భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ భవితవ్యం మరో వారంలో తేలిపోనుంది. ఇంగ్లాండ్ వేదికగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉంటున్న ధోనీ.. రిటైర్మెంట్‌ గురించి సెలక్టర్లు, బీసీసీఐకి ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో.. అతని భవితవ్యంపై గత మూడు నెలలుగా సందిగ్ధత నెలకొనగా.. బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆ సందిగ్ధతకి ఈ నెల 24న తెరదించుతానని ప్రకటించాడు.
 
బంగ్లాదేశ్‌తో నవంబరు 3 నుంచి మూడు టీ20ల సిరీస్‌లో భారత్ తలపడనుండగా.. ఈ సిరీస్ కోసం ఈనెల 24న జట్టుని భారత సెలక్టర్లు ఎంపిక చేయనున్నారు. అప్పటిలోపు బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ధోనీ భవితవ్యంపై సెలక్టర్ల ఆలోచన ఏంటో..? ఈ నెల 24న వారిని కలిసినప్పుడు నేను స్వయంగా అడిగి తెలుసుకుంటా. ఆ తర్వాత నా అభిప్రాయం కూడా వారికి చెప్తాను అని దాదా వ్యాఖ్యానించాడు. ధోనీతో కూడా ఈ విషయంపై మాట్లాడుతానని గంగూలీ వ్యాఖ్యానించాడు.