గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2019 (19:21 IST)

ధోనీ మాస్ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ.. కోహ్లీ కూడా ముట్టుకోలేదు..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సమం చేశాడు. ఈ రికార్డును టీమిండియా సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ముట్టుకోకపోవడం విశేషం. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ-20 మ్యాచ్‌లో ఆడటం ద్వారా రోహిత్ శర్మ ఈ రికార్డును సమం చేశాడు. 
 
ఇంతకీ ఆ రికార్డు వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాతో చివరి టీ-20 మ్యాచ్.. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఇందులో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. రోహిత్ శర్మ 9 పరుగుల వద్ద, విరాట్ కోహ్లీ కూడా 9 పరుగుల వద్ద అవుటైయ్యారు. 
 
అంతేగాకుండా ఆపై బరిలోకి దిగిన టీమిండియా ప్లేయర్లు ఒకరి తర్వాత ఒకరు అవుట్ అవుతూ క్రికెట్ అభిమానులకు షాకిచ్చారు. చివరికి 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయిన భారత్ 134 పరుగులు సాధించింది. అయితే శిఖర్ ధావన్ మాత్రం జట్టులో అత్యధిక స్కోరుగా 36 పరుగులు సాధించాడు.


తదనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 16.5 ఓవర్లలోనే 140 పరుగులు సాధించి.. తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డికాక్ 79 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా 1-1 తేడాతో టీ-20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా సమం చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ధోనీ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. రోహిత్ శర్మ తన కెరీర్‌లో 98వ టీ-20 మ్యాచ్‌ను ఆదివారం దక్షిణాఫ్రికాతో ఆడాడు. తద్వారా అత్యధిక టీ-20 మ్యాచ్‌ల్లో ఆడిన భారత క్రికెటర్‌గా ఇదివరకు ధోనీ (98 టీ-20 మ్యాచ్‌లు) రికార్డును రోహిత్ సమం చేశాడు.  
 
ఈ జాబితాలో సురేష్ రైనా (78 టీ-20 మ్యాచ్‌లు), కోహ్లీ (72 మ్యాచ్‌లు)లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. అలాగే పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 111 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌లు ఆడటం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు. రెండో స్థానంలోనూ పాకిస్థాన్ క్రికెట్ షాహిద్ అఫ్రిది 99 మ్యాచ్‌ల రికార్డుతో నిలిచాడు.