సోమవారం, 17 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 నవంబరు 2025 (12:48 IST)

'ఈ పూటకు వెళ్లొద్దు... ఇంట్లోనే ఉండిపో నాన్నా' అని చెప్పినా వినలేదు.. చివరకు శాశ్వతంగా...

blast
'ఈ పూటకు వెళ్లొద్దు.. ఇంట్లోనే ఉండిపో నాన్నా' అంటూ తన తండ్రికి కుమార్తె చెప్పింది. కానీ ఆయన మాత్రం వినకుండా వెళ్లి చివరకు ఆ కుటుంబానికి శాశ్వతంగా దూరమయ్యాడు. ఇటీవల శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషనులో జరిగిన పేలుడు కారణంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. మృతుల్లో పోలీసుకు సాయం చేసేందుకు వెళ్లిన మహ్మద్ షఫీ (57) కూడా చనిపోయాడు. స్థానికంగా టైలర్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే షఫీ... తరచుగా పోలీసులకు సాయం చేస్తుంటాడు. తద్వారా కొంత మొత్తం ఆదాయాన్ని అర్జిస్తుంటాడు. 
 
ఈ క్రమంలో పేలుడు పదార్థాల పరిశీలనకు ఫోరెన్సిక్ నిపుణులు నౌగామ్ పోలీస్ స్టేషన్‌కు రాగా, పోలీసులు సాయం కోసం షఫీని పిలిపించారు. శుక్రవారం ఉదయమే ఠాణాకు వెళ్లిన షఫీ.. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి నమాజ్ చేసి తిరిగి వెళ్లాడు. రాత్రి భోజనానికి వచ్చిన షఫీ... మరోమారు వెళుతుంటే కుమార్తె అడ్డు చెప్పింది. ఈ పూటకు ఇక వెళ్లొద్దు.. ఇంట్లో ఉండిపో నాన్నా అంటూ చెప్పింది. 
 
కానీ, ఇంకా కొంచెం పని మిగిలివుంది అది పూర్తి చేసి వస్తానమ్మా అంటూ వెల్లిన షఫీ.. చివరకు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయాడు. నౌగామ్ పోలీస్ స్టేషనులో పేలుడు జరిగిందన్న వార్త తెలుసుకున్న షఫీ కుటుంబ సభ్యులు ఒక్క పరుగున అక్కడకు వెళ్లి చూడగా అంతా బూడిద కుప్ప కనిపించింది. దీన్ని చూడగానే వారు కుప్పకూలిపోయి కన్నీటిపర్యంతమయ్యారు.