గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2019 (15:10 IST)

డ్రైవర్లుగా మారుతున్న పాకిస్థాన్ క్రికెటర్లు... కారణం ఏంటంటే...

పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్లు ఇపుడు క్యాబ్ లేదా వ్యాను డ్రైవర్లుగా మారుతున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో పాటు.. ఆ దేశం తీసుకున్న నిర్ణయం కారణంగా క్రికెటర్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఫలితంగా గతంలో లక్షల్లో ఆదాయాన్ని అర్జిస్తూ వచ్చిన క్రికెటర్లు ఇపుడు వేల రూపాయల ఆదాయానికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా క్యాబ్ డ్రైవర్‌గా మారిన ఓ క్రికెటర్... మీడియా కంటపడటంతో వారి దయనీయ పరిస్థితి వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇటీవల ఓ కొత్తవిధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల జట్ల మధ్య డిపార్ట్‌మెంటల్ క్రికెట్ పోటీల వ్యవస్థను రద్దు చేసింది. దాంతో ఆయా డిపార్ట్‌మెంట్ల జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 
 
అంతకుముందు లక్ష రూపాయల వరకు పారితోషికం పొందిన వాళ్లు ఇప్పుడు యేడాదికి రూ.30 వేలతో సర్దుకుపోవాల్సిన పరిస్థితి. దాంతో అనేకమంది క్రికెటర్లు ఇతర వృత్తుల బాటపడుతున్నారు. ఫజల్ సుభాన్ అనే క్రికెటర్ పికప్ వ్యాన్ నడుపుకుంటూ మీడియా కంట్లోపడటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
కాగా, ఫజల్ 40 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 2,301 పరుగులు చేయగా, లిస్ట్-ఏ కెరీర్‌లో 29 పోటీలు ఆడి 659 పరుగులు సాధించాడు. తాను డిపార్ట్‌మెంటల్ క్రికెట్ ఆడే సమయంలో లక్ష రూపాయల వరకు సంపాదించేవాడిని, పీసీబీ కొత్త విధానంతో తమ ఆదాయం తగ్గిపోయిందని వాపోయాడు. అందుకే డ్రైవర్ అవతారం ఎత్తాల్సి వచ్చిందని వాపోయాడు.