TVK Vijay: విజయ్ ర్యాలీలో పెను విషాదం, తొక్కిసలాటలో 20 మంది మృతి, ఇంకా పెరిగే అవకాశం
తమిళనాడులోని కరూర్‌లో పెను విషాదం చోటుచేసుకున్నది. శనివారం నాడు ఇక్కడ నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో పిల్లలు సహా ఇరవై మంది చనిపోయి ఉంటారని స్థానిక ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఇప్పటికే 500 మందిని ఆసుపత్రికి తరలించగా, ఇంకా 400 మందిని తీసుకువస్తున్నట్లు సమాచారం. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సీనియర్ పోలీసు అధికారి డేవిడ్సన్ దేవాశిర్వతం తెలిపారు.
విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రీ కజగం(టీవీకే) మద్దతుదారులు కనీసం ఆరు గంటలుగా అతని కోసం వేచి ఉన్నారు. ఐతే విజయ్ ర్యాలీ వేదిక వద్దకు ఆలస్యంగా చేరుకున్నాడు. దీనితో అప్పటికే కిక్కిరిసి వున్న జనవాహిన ఒక్కసారిగా తోపులాటతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. తొక్కిసలాటతో అక్కడ పరిస్థితి బీభత్సంగా మారింది. పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎం. సుబ్రమణియన్ కరూర్‌కు చేరుకున్నారు. పరిస్థితిని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కరూర్ జిల్లా కార్యదర్శి వి. సెంథిల్ బాలాజీని ఆదేశించారు.
కరూర్ నుండి వస్తున్న వార్తలు ఆందోళనకరంగా ఉన్నాయి. తొక్కిసలాట కారణంగా స్పృహ కోల్పోయిన తర్వాత ఆసుపత్రిలో చేరిన ప్రజలకు వెంటనే వైద్య చికిత్స అందించాలని నేను కోరాను అని శ్రీ స్టాలిన్ తమిళంలో Xలో పోస్ట్‌లో తెలిపారు.
కరూర్‌లో కిక్కిరిసిన ర్యాలీలో విజయ్ తన ప్రసంగాన్ని అకస్మాత్తుగా ముగించాడని, చాలా మంది స్పృహ కోల్పోవడం ప్రారంభించారని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. వారిని అంబులెన్స్‌లలో ఆసుపత్రికి తరలించారు.