శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 28 జూన్ 2017 (01:31 IST)

రవిశాస్త్రిది నాలుకా తాటిమట్టా.. కోచ్ పదవికి దరఖాస్తు...కోహ్లీ వత్తాసేనా?

అనుకున్నట్లే జరుగుతోంది. టీమిండియాపైనే కాదు బీసీసీఐ మీద కూడా కెప్టెన్ కోహ్లీ ప్రభావం, పలుకుబడి బీభత్సంగా ఉందని తేలిపోయింది. టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు కూడా చేయనని చెప్పి దూరంగా ఉన్న రవిశాస్త్రి ఇప్పుడు ఉన్నట్లుండి యూటర్న్ తీసుకుని నేరుగా దరఖ

అనుకున్నట్లే జరుగుతోంది. టీమిండియాపైనే కాదు బీసీసీఐ మీద కూడా కెప్టెన్ కోహ్లీ ప్రభావం, పలుకుబడి బీభత్సంగా ఉందని తేలిపోయింది. టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు కూడా చేయనని చెప్పి దూరంగా ఉన్న రవిశాస్త్రి ఇప్పుడు ఉన్నట్లుండి యూటర్న్ తీసుకుని నేరుగా దరఖాస్తు చేసుకోవడం క్రికెట్ అభిమానులకు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అనిల్ కుంబ్లేని పొగ పెట్టి మరీ తప్పించడానికి కూడా రవిశాస్త్రిని ముగ్గులోకి దింపే ఉద్దేశ్యమే కారణమా? వేగంగా మారుతున్న పరిణామాలను చూస్తుంటే కుంబ్లే రాజీనామా ఘటనలో తెరవెనుక ముసుగులో గుద్దులాట చాలా జరిగిందని తేలుతోంది.
 
టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవికి దూరంగా ఉంటానని గతంలో వ్యాఖ్యానించిన రవిశాస్త్రి.. అందరూ ఊహించినట్లే యూటర్న్‌ తీసుకున్నాడు. హెడ్‌కోచ్‌ పదవికి దరఖాస్తు చేయనున్నట్లు మంగళవారం ప్రకటించాడు. దీంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పంతం నెగ్గినట్లయింది. పదవీకాలం పొడగింపునకు సుముఖంగా లేని అనిల్‌ కుంబ్లే.. ఛాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం రాజీనామా చేయడంతో హెడ్‌ కోచ్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
 
హెడ్‌కోచ్‌ పదవి కోసం మే నెలలో దరఖాస్తులు కోరగా.. వీరేంద్ర సెహ్వాగ్‌, టామ్‌ మూడీ, దొడ్డ గణేష్‌, పైబ్స్‌, రాజ్‌పుత్‌ తదితర దిగ్గజాలు అప్లికేషన్లు పంపారు. కుంబ్లే పదవీకాలం చివరిరోజుల్లోనే.. మరికొంత కాలం ఆయనను కొనసాగించాలని బోర్డు భావించింది. కానీ అందుకు కెప్టెన్‌ కోహ్లీ సుముఖంగా లేకపోవడం, అదే సందర్భంలో జట్టులోని విబేధాలు బయటపడటంతో కుంబ్లే రాజీనామాచేసి వెళ్లిపోయారు. 
 
ఆ తర్వాత బీసీసీఐ రెండోసారి కోచ్‌ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించి.. జూలై 9 తుది గడువుగా నిర్ణయించింది. దీంతో రవిశాస్త్రి కోసమే అప్లికేషన్ల ప్రక్రియను పొడగించారనే విమర్శలు వెల్లువెత్తాయి. కెప్టెన్‌ కోహ్లీ కోరికమేరకు రవిశాస్త్రి హెడ్‌కోచ్‌ పదవికి అప్లై చేసినా.. ఎంపిక కావడం అంతసులువేమీ కాదు. 
 
ఎందుకంటే, ఈ సారికూడా శాస్త్రిని ఇంటర్వ్యూ చేయబోయేది సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన సలహా మండలే! గతంలో కోచ్‌పదవికి శాస్త్రిని రిజెక్ట్‌ చేసింది కూడా ఈ మండలే కావడం గమనార్హం. కోచ్‌ ఎంపిక విషయంలో కెప్టెన్ల ప్రమేయంపై మాజీ సీఓఏ రామచంద్రగుహ తీవ్రఅసహనం వెలిబుచ్చిన నేపథ్యంలో త్రిసభ్య కమిటీ ఎంపిక ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.