ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2024 (10:04 IST)

అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ సరికొత్త రికార్డులు

rohit sharma
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాడు. ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్ దేశాలు కలిసి ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్‌లో టీమిండియాను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన రోహిత్.. పనిలోపనిగా తన పేరిట మరో రికార్డును లిఖించుకున్నాడు. 
 
గురువారం గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లను రోహిత్ శర్మ చితక్కొట్టాడు. ఒక పక్క కోహ్లీ, పంత్ ఔటైనప్పటికీ తన జోరును మాత్రం తగ్గించలేదు. 39 బంతుల్లోనే 57 పరుగులను బాదేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 2 భారీ సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి.
 
ఈ మ్యాచ్ 5వ ఫోర్ కొట్టాక రోహిత్ శర్మ ఒక ఆల్ టైమ్ వరల్డ్ కప్ రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తం 113 ఫోర్లతో టీ20 ప్రపంచ కప్ హిస్టరీలో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా హిట్ మ్యాన్ అవతరించాడు. 111 ఫోర్లతో ఇంతకాలం టాప్ ప్లేస్‌లో ఉన్న శ్రీలంక దిగ్గజ బ్యాటర్ మహేళ జయవర్ధనేని రోహిత్ అధిగమించాడు. ఇక ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 105 ఫోర్లతో 3వ స్థానంలో నిలిచాడు.
 
కాగా ఈ మ్యాచ్ రెండు సిక్సర్లు బాదిన రోహిత్ టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో 50 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు నమోదు చేసిన మొదటి భారత ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లండ్‌పై రెండు సిక్సర్లతో అతడి సిక్సర్ల సంఖ్య 50కి చేరింది. కాగా 63 సిక్సులతో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తొలి స్థానంలో నిలిచాడు. 
 
మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ 5,000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ రికార్డు సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా నిలిచాడు. రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ ఉన్నారు.
 
టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక ఫోర్లు..
1. రోహిత్ శర్మ - 113 ఫోర్లు (43 మ్యాచ్ )
2. మహేళ జయవర్ధనే - 111 ఫోర్లు (31 మ్యాచ్ )
3. విరాట్ కోహ్లి - 105 ఫోర్లు (32 మ్యాచ్)
4. డేవిడ్ వార్నర్ 103 ఫోర్లు (41 మ్యాచ్ ల్లో)
5. తిలకరత్నే దిల్షాన్ - 101 ఫోర్లు (34 మ్యాచ్)