Shreyas Iyer: ప్రస్తుతం నేను కోలుకునే ప్రక్రియలో ఉన్నాను.. అందరికీ ధన్యవాదాలు.. శ్రేయాస్ అయ్యర్
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తాను గాయానికి గురికావడంపై తొలి సారి స్పందించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ప్రాణాంతక గాయానికి గురైన విషయంపై సోషల్ మీడియా వేదికగా తన గాయానికి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం తాను కోలుకునే ప్రక్రియలో ఉన్నానని, రోజు రోజుకి చాలా మెరుగవుతున్నానని వెల్లడించాడు. ఈ కష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. మీ ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటానని ఎక్స్ పోస్టులో పేర్కొన్నాడు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ గాయపడిన సంగతి తెలిసిందే. అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్‌ను వెనక్కి పరుగెత్తుతూ అందుకునే క్రమంలో అయ్యర్ కిందపడిపోయాడు. దాంతో అతని పక్కటెముకల్లో ఉండే సున్నితమైన ప్లీహానికి గాయమైంది.
వైద్య పరీక్షల్లో శ్రేయాస్ అయ్యర్‌కు అంతర్గత రక్త స్రావం అవుతుందని గ్రహించారు వైద్యులు వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. రక్తస్రావం ఆగిపోవడంతో జనరల్ వార్డ్‌లోని ప్రత్యేక గదికి షిఫ్ట్ చేశారు. టీమిండియా ఫిజియోల వేగవంతమైన చికిత్స కారణంగా శ్రేయస్ అయ్యర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని బీసీసీఐ చీఫ్ డాక్టర్ మీడియాకు తెలిపాడు. శ్రేయస్ అయ్యర్ వేగంగా కోలుకుంటున్నాడని కూడా చెప్పాడు.