ఆస్పత్రి పాలైన శ్రేయాస్ అయ్యర్.. అంతర్గత రక్తస్రావం.. పక్కటెముకలో గాయం
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆస్పత్రి పాలయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో పక్కటెముక గాయం కారణంగా అంతర్గత రక్తస్రావం కావడంతో శ్రేయాస్ సిడ్నీలోని ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు.
ఆసీస్ బ్యాటర్ అలెక్స్ కారీని అవుట్ చేయడానికి బ్యాక్‌వర్డ్ పాయింట్ నుండి వెనుకకు పరిగెత్తుతూ అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు అయ్యర్. ఈ ప్రక్రియలో అతని ఎడమ పక్కటెముకకు గాయమైనట్లు కనిపించాడు. శనివారం డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వచ్చిన వెంటనే టీం డాక్టర్, ఫిజియో ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా.. వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
రెండు రోజుల పాటు శ్రేయాస్ అయ్యర్ ఆస్పత్రిలో వున్నాడు. అయ్యర్‌కు అంతర్గత రక్తస్రావం అయినట్లు వైద్యులు గుర్తించారు. మొదట్లో అయ్యర్ దాదాపు మూడు వారాల పాటు ఆటకు దూరంగా ఉంటారని భావించారు. కానీ గాయం పెద్దది కావడంతో ఇప్పుడు కోలుకునే కాలం ఎక్కువ కావచ్చని తెలుస్తోంది.