1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 11 మే 2016 (18:39 IST)

2019 వన్డే ప్రపంచకప్ వరకు ధోనీ ఉంటే ఆశ్చర్యమే.. కోహ్లీ ది బెస్ట్: గంగూలీ

2019 వన్డే ప్రపంచకప్ వరకు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథిగా ఉండటం డౌటేనని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తెలిపాడు. ధోనీ నాయకత్వం గురించి గంగూలీ ఎప్పుడూ ప్రశంసలు కురిపిస్తూనే ఉంటాడు కానీ, క్రమంగా అతడు తన బాధ్యతలను వేరే వాళ్లకు ఇవ్వాల్సిన సమయం ఆసన్నం అవుతోందని సూచించాడు.  
 
ఇంకా దాదా మాట్లాడుతూ.. 2019 వన్డే ప్రపంచకప్‌ వరకు మహీకి కెప్టెన్‌గా కొనసాగే సత్తా ఉందా అనేది అనుమానమేనని.. ఒకవేళ అతను కొనసాగితే ఆశ్చర్యమేనని దాదా వ్యాఖ్యానించాడు. ధోని ఇప్పటికే టెస్టులకు వీడ్కోలు చెప్పి వన్డేలు, ట్వంటీ-20లు మాత్రమే ఆడుతున్నాడు
 
ఈ నేపథ్యంలో ధోనీ 2019 ప్రపంచకప్‌ వరకు కొనసాగుతాడో లేదో అనే దానిపై సెలెక్టర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం విరాట్‌ కోహ్లి అన్ని ఫార్మాట్లలో మెరుగ్గా ఆడుతున్నాడు. మానసికంగానూ విరాట్‌ బలవంతుడు. టెస్టు కెప్టెన్‌గా విరాట్‌ రికార్డు కూడా మెరుగ్గా ఉంది. ధోని తీసుకునే నిర్ణయంపైనే కోహ్లిని అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమించాలనే విషయం ఆధారపడి ఉంటుంది’’ అని గంగూలీ పేర్కొన్నాడు.
 
అంతేగాకుండా కోహ్లీని దాదా ఫుట్‌బాల్ లెజెండ్ డిగో మారడోనాతో గంగూలీ పోల్చాడు. ప్రస్తుతం టెస్టు ఫార్మాట్లో విజయవంతమైన కెప్టెన్‌గా నిరూపించుకున్న కోహ్లీ.. మెల్లమెల్లగా కోలుకుంటాడని.. నిలకడ విషయంలో అతనే బెస్ట్ అంటూ గంగూలీ కితాబిచ్చాడు.