శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2023 (09:56 IST)

ఆసియా కప్ : ఆప్ఘనిస్థాన్‌ను ఓడించిన దురదృష్టం - 2 రన్స్ తేడాతో ఓటమి

afghanteam
ఆసియా క్రికెట్ కప్ టోర్నీలో భాగంగా, లాహోర్ వేదికగా శ్రీలంక జట్టుతో ఆప్ఘనిస్థాన్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో దురదృష్టం వెంటాడంతో ఆప్ఘాన్ కుర్రోళ్లు కేవలం రెండు పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. శ్రీలంక నిర్దేశించిన 292 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విజయానికి 2 పరుగులు దూరంలోకి వచ్చి ఆగిపోయారు. 
 
లక్ష్య ఛేదనలో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూనే విజయం దిశగా అడుగులేసిన ఆఫ్ఘాన్ జట్టు చివరికి రెండంటే రెండు పరుగుల తేడాతో ఓటమి పాలై సూపర్-4 అవకాశాన్ని చేజార్చుకుంది. ఆడిన రెండు మ్యాచ్‌లోనూ ఓడిన ఆఫ్ఘనిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, ఒక్క మ్యాచ్‌లో నెగ్గిన బంగ్లాదేశ్ జట్టు సూపర్-4కి అర్హత సాధించింది.
 
కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగుల భారీ స్కోరు సాధించారు. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ 84, ఓపెనర్ పాతుమ్ నిశ్శంక 41, కరుణరత్నె 32, అసలంక 36, దునిత్ వెల్లలగే 33 (నాటౌట్), తీక్షణ 28 పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో గుల్బాదిన్ 4 వికెట్లు తీసుకున్నాడు.
 
అనంతరం 292 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆఫ్ఘనిస్థాన్ మెరుపు వేగంతో ఆడింది. అయితే, వికెట్లను క్రమంతప్పకుండా పారేసుకోవడంతో ఓటమి పాలైంది. 37.4 ఓవర్లలోనే 289 పరుగులు చేసి విజయానికి రెండు పరుగుల ముందు బోల్తాపడింది. మహమ్మద్ నబీ 65 పరుగులు చేసి శ్రీలంకకు ముచ్చెమటలు పట్టించగా, గుల్బాదిన్ నైబ్ 22, రహ్మత్ షా 45, కెప్టెన్ హస్మతుల్లా షాహిద్ 59, కరీం జనత్ 22, నజీబుల్లా జద్రాన్ 23, రషీద్ ఖాన్ 27 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో కాసున్ రజితకు 4 వికెట్లు దక్కాయి. బుధవారం లాహోర్‌లో బంగ్లాదేశ్ - పాకిస్థాన్ జట్లు తలపడతాయి.