1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (16:39 IST)

టీ20 వరల్డ్ కప్‌ నిర్వహణపై చేతులెత్తేసిన బీసీసీఐ!

ఐసీసీ నిర్వహించే ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఒకటైన టీ20 ప్రపంచ కప్ నిర్వహణపై బీసీసీఐ చేతులెత్తేసింది. దీంతో ఈ మెగా టోర్నీ దేశం నుంచి త‌ర‌లిపోయింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో భారత్‌లో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ నిర్వ‌హించ‌లేమ‌ని, యూఏఈలో టోర్నీ జ‌రుగుతుంద‌ని బీసీసీఐ సోమ‌వారం స్పష్టం చేసింది. 
 
టోర్నీ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి నిర్ణ‌యం చెప్ప‌డానికి సోమవారం వ‌ర‌కూ బీసీసీఐకి ఐసీసీ గ‌డువు విధించిన విష‌యం తెలిసిందే. దీంతో సోమ‌వారం బీసీసీఐ ఆఫీస్ బేరర్ల మ‌ధ్య కాన్ఫ‌రెన్స్ మీటింగ్ జరిగింది. ఈ విషయాన్ని బోర్డు ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా వెల్ల‌డించారు.
 
"రానున్న 2-3 నెల‌ల్లో ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ ఖచ్చితంగా చెప్ప‌లేరు. అన్ని విష‌యాల‌ను దృష్టిలో ఉంచుకొని టోర్నీని యూఈఏకి త‌ర‌లిస్తామ‌ని ఐసీసీతో చెప్పాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించింది. ఎందుకంటే ఇండియా త‌ర్వాత టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు యూఏఈయే మంచి వేదిక‌" అని తెలిపారు. 
 
నిజానికి ఈ మెగా టోర్నీని భారత్‌లోనే నిర్వహించాలని భావించాం. ఇండియానే మా మొద‌టి ప్రాధాన్య‌త‌గా భావించాం. కానీ త‌ప్ప‌లేదు. టోర్నీ తేదీల్లో ఎలాంటి మార్పులు లేవు. ఐపీఎల్ ముగియ‌గానే ప్రారంభ‌మ‌వుతుంది. క్వాలిఫ‌య‌ర్స్ ఒమ‌న్‌లో జ‌ర‌గొచ్చు. టోర్నీలో మ్యాచ్‌లు మాత్రం దుబాయ్‌, అబుదాబి, షార్జాల్లో జ‌రుగుతాయి అని రాజీవ్ శుక్లా స్ప‌ష్టం చేశారు.