1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 జూన్ 2021 (16:53 IST)

యూఏఈకి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్ షిప్ట్?

భారత్‌ నుంచి మరో అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ ఈవెంట్ అరబ్ దేశానికి తరలివెళ్ళనుంది. ఇప్పటికే ఐపీఎల్ యూఏఈకి తరలివెళ్లింది. ఇపుడు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం భారత్‌లో నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్ యూఏఈకి తరలి వెళ్లనుంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 
 
తాజా సమాచారం ప్రకారం... యూఏఈ గడ్డపై ఈ టోర్నీ అక్టోబరు 17వ తేదీన ప్రారంభంకానుంది. నవంబరు 14న టోర్నీ ఫైనల్ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. వేదిక మార్పు అంశాన్ని బీసీసీఐ తదుపరి సమావేశంలో ఐసీసీకి నివేదించనుంది. అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
 
దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి విస్తృతంగా ఉండటంతో పాటు.. థర్డ్ వేవ్ పొంచివుందన్న కారణంతో ఈ టోర్నీని భారత్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపడం లేదు. పైగా, ఇంతటి పెద్ద టోర్నీని నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి ఎలాంటి పన్ను మినహాయింపులు ఇవ్వడం లేదు. 
 
ఇటీవల ఐపీఎల్ ఆగిపోవడంతో స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లు ఇప్పట్లో భారత గడ్డపై అడుగుపెట్టే పరిస్థితులు లేకపోవడం మరో కారణం. కాగా, టీ20 వరల్డ్ కప్ వేదిక మార్పు అంశంపై బీసీసీఐ కార్యదర్శి జై షా వివరణ ఇచ్చారు. 
 
దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో టోర్నీ తరలింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఆటగాళ్ల ఆరోగ్య భద్రతే తమకు పరమావధి అని చెప్పారు. త్వరలోనే అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు.