గుప్త నిధుల కోసం తొమ్మిదేళ్ల బాలుడి నరబలి.. ఎక్కడ?
మూఢ నమ్మకం అభంశుభం తెలియని ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గుప్త నిధుల కోసం చేపట్టిన క్షుద్ర పూజల కోసం తొమ్మిదేళ్ల బాలుడిని నరబలి ఇచ్చారు. ఆరు బయట ఆడుకుంటున్న పిల్లాడిని అపహరించి నరబలి పేరుతో దారుణంగా హత్య చేశారు. ఈ దారుణం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలేగావ్ తాలూకాలో పొహనెషివార్ గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
ఈ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆరుబయట ఆడుకుంటున్న ఓ బాలుడిని అపహరించారు. తాంత్రిక పూజలు నిర్వహించి గొంతుకోసి చంపేశారు. మృతదేహాన్ని గుంత తీసి అందులో సగం వరకు పాతిపెట్టారు. ఈ దారుణ ఘటన జూలై 18వ తేదీన జరిగింది. శనివారం ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. గుప్తనిధుల కోసం అన్వేషిస్తున్నామని, అందుకోసం ఈ దారుణానికి పాల్పడినట్టు నేరాన్ని అంగీకరించారు.