గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (16:40 IST)

నడిరోడ్డుపై వెంటపడి.. కత్తులతో వేటాడి... పట్టపగలు హత్య

murder
హైదరాబాద్ నగరంలో పట్టపగలు దారుణ హత్య జరిగింది. నడిరోడ్డుపై వెంటపడి, కత్తులతో వెంటాడి, దాడి చేసి హత్య చేశారు. ఈ హత్య జరిగే సమయంలో అనేక మంది అక్కడే ఉన్నప్పటికీ ఒక్కరు కూడా హత్యను ఆపేందుకు ముందుకు రాకపోగా, తమ మొబైల్ ఫోన్లలో హత్యా దృశ్యాలను చిత్రీకరించే పనిలో నిమగ్నమయ్యారు. కళ్ళెదుట దారుణం జరుగుతున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా 100 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వలేక పోయారు. దీంతో ఓ వ్యక్తి ప్రాణాలు పట్టపగలు నడి రోడ్డుపై గాల్లో కలిసిపోయాయి. హత్యకు గురైన వ్యక్తిని సాయినాథ్‌ (29)గా గుర్తించారు. అంబర్‌పేట్ బతుకమ్మ కుంటకు చెందిన కార్పెంటర్‌గా తేలింది. 
 
ఆదివారం సాయంత్రం ఒంటరిగా తన ద్విచక్రవాహనంపై పురానాపూల్ వైపు నుంచి జియాగూడ మేకలమండీ మార్గంలో వెళుతున్నాడు. పీలమండవ్ శివాలయం సమీపంలో ముగ్గురు అగంతకులు అడ్డుగా వచ్చి ఇనుపరాడ్‌‍లతో సాయినాథ్‌పై తల వెనుక భావంలో బలంగా కొట్టడంతో కిందపడిపోయాడు. కొడవలి, కత్తి, ఇనుపరాడ్‍‌లతో అతనిపై దాడి చేశారు. వీరి నుంచి తప్పించుకునేందుకు బిగ్గరగా కేకలు వేస్తూ పరుగుపెట్టాడు. అయినప్పటికీ వెంటపడి వేటాడి  హత్య చేశారు. కత్తితో ముఖం, చేతులు, కాళ్లు పాశవికంగా నరికివేసారు. 
 
ఆ సమయంలో పురానామాల్ వైపు నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న గోషామహల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ జనార్థన్‌ ఈ దారుణాన్ని గమనించి పెద్దగా కేకలు వేస్తూ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను చూసిన వెంటనే దుండగులు మూసీ నదిలో దూకి పారిపోయారు. రక్తపు మడుగులో పడివున్న వ్యక్తిని ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
అప్పటికే మృతి చెందినట్టు గుర్తించి 100 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీనిపై గోషామహల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆర్థిక లావాదేవీలు లేదా వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగివుండొచ్చని పోలీసులు సమాచారం.