శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2023 (10:00 IST)

చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న గురుకుల లేడీ టీచర్...

deadbody
పాఠశాల హెడ్మాస్టర్‌తో పాటు ఇతర ఉపాధ్యాయులు మానసికంగా వేధించడాన్ని జీర్ణించుకోలేని ఓ మహిళా టీచర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరిగింది. 
 
ఈ గ్రామంలోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకు పాఠశాల ఉంది. ఇందులో తిరుమలేశ్వరి (35) పని చేస్తున్నారు. ఈమెకు విధి నిర్వహణలో తోటి ఉపాధ్యాయురాళ్లు, మహిళా ప్రిన్సిపల్‌ పనిగట్టుకొని ఆమెకు సమస్యలు సృష్టించారు. ఆపై ఆ సమస్యలకు ఆమే కారణం అన్న వాతావరణం సృష్టించి.. ఆమెను సూటిపోటి మాటలతో బాధించారు. సహచరుల తీరుతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ ఉపాధ్యాయురాలు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. 
 
తన చావుకు ప్రిన్సిపల్‌, తోటి ఉపాధ్యాయురాళ్ల వేధింపులే కారణం అని వాయిస్‌ రికార్డులో తిరుమలేశ్వరి పేర్కొన్నారు. తిరుమలేశ్వరి స్వగ్రామం మంచిర్యాల జిల్లా నస్పూర్‌. ఆమెకు భర్త సంపత్‌, 11 ఏళ్ల కూతురు ఉన్నారు. కరీంనగర్‌ గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆమె నాలుగేళ్ల క్రితం డిప్యుటేషన్‌పై చెన్నూరు గురుకుల పాఠశాలకు వచ్చారు. 
 
అయితే, గురుకుల పాఠశాలలో జరుగుతున్న జోనల్ స్థాయి ఆటల పోటీల్లో పాల్గొంటున్న 1275 మంది క్రీడాకారులు, మరో వంద మంది వరకు సాహయ సిబ్బందికి భోజన ఏర్పాట్లుచేసే బాధ్యతను అప్పగించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన మెస్ కమిటీలో పది మంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఆమెకు సహాయం చేయాలి. కానీ వారంతా సహాయక నిరాకరణ చేశారు. దీంతో తిరుమలేశ్వరి ఒక్కరే ఆ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఆదివారం టిఫిన్‌, భోజనం ఆలస్యంగా అందడంతో అందరూ తిరుమలేశ్వరినే తప్పుబట్టారు. విధి నిర్వహణలో భాగంగా ఉదయం ఎనిమిది గంటలకు భర్త సంపత్‌ తిరుమలేశ్వరిని గురుకులంలో దింపి వెళ్లాడు. గంట తర్వాత భర్త ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు. రెండు మూడుసార్లు ఫోన్‌ చేయగా ఒక వ్యక్తి లిఫ్ట్‌ చేసి పెద్ద చెరువు కట్టపై బ్యాగు ఉందని, ఫోన్‌ మోగడంతో లిఫ్ట్‌ చేశానని చెప్పాడు. 
 
వెంటనే సంపత్‌ చెరువు కట్ట వద్దకు వెళ్లగా అప్పటికే తిరుమలేశ్వరి చెరువులో దూకినట్లు గుర్తించాడు. జాలర్ల సహాయంతో చెరువులో గాలించగా తిరుమలేశ్వరి మృతదేహం లభ్యమైంది. మృతురాలి సెల్‌ఫోన్‌లో ప్రిన్సిపల్‌ సహా ఐదుగురి వేధింపులపై తిరుమలేశ్వరి వాయిస్‌ రికార్డు ఉందని సీఐ వాసుదేవరావు వెల్లడించారు. 
 
తన భార్య తిరుమలేశ్వరి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ రాజమణి, అసిస్టెంట్‌ కేర్‌ టేకర్‌ స్రవంతి, పీఈటీలు రేష్మ, శిరీష, పుష్పలత వేధించడం వల్లే తిరుమలేశ్వరి ఆత్మహత్య చేసుకుందంటూ భర్త సంపత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.