బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (08:20 IST)

ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన మైనర్ బాలిక

తన ప్రేమను తిరస్కరించిన కన్నతల్లిని మైనర్ బాలిక తన ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడింది. ఈ దారుణం హైదరాబాద్‌ శివారులోని రాజేంద్రనగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాల మేరకు... చింతల్‌మెట్‌కు చెందిన బాలిక (17) అదే ప్రాంతానికి చెందిన బాలుడి (17)తో ప్రేమలో పడింది. 
 
ఇద్దరూ కలిసి తిరుగుతున్న విషయం తెలిసిన బాలిక తల్లి కుమార్తెను మందలించింది. అయినప్పటికీ బాలిక ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో సోమవారం మరోమారు తీవ్రస్థాయిలో హెచ్చరించింది. దీంతో తమ ప్రేమకు తల్లి ఎప్పటికైనా అడ్డమేనని భావించిన బాలిక.. బాలుడిని ఇంటికి పిలిపించింది.
 
అనంతరం తల్లితో గొడవకు దిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన బాలిక.. తల్లి మెడకు చున్నీ బిగించి ప్రియుడి సాయంతో హతమార్చింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నిర్భయంగా ఈ దారుణానికి పాల్పడింది. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న బాలిక తండ్రి జరిగిన ఘోరం చూసి పోలీసులకు సమాచారం అందించారు.
 
 ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితులైన బాలుడు, బాలికను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారిద్దరూ హత్యను అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.