లిఫ్టులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన లేడీ టీచర్.. ఎక్కడ?
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని మలాడ్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. లిఫ్టులో చిక్కుకున్న ఓ ఉపాద్యాయురాలు ప్రాణాలు కోల్పోయింది. లిఫ్టుకు ఉండే రెండు డోర్ల మధ్య ఆమె చిక్కుకుని పోవడంతో తీవ్రంగా గాయపడిన తుదిశ్వాస విడిచింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
26 ఏళ్ల జెనెల్ ఫెర్నాండెజ్ అనే మహిళ స్థానికంగా ఉండే సెయింట్ మేరీస్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెండో అంతస్తులో ఉన్న స్టాఫ్ రూంకు వెళ్లేందుకు 6వ ఫ్లోర్‌లో లిఫ్ట్ కోసం వేచిచూస్తోంది. ఇంతలో లిఫ్ట్ వచ్చి ఆగగా, ఆమె అందులో ప్రవేశిస్తుండగానే డోర్లు మూసుకుపోయాయి. దాంతో ఆ రెండు డోర్ల మధ్యన ఆమె చిక్కుకుని పోగా, ఆ లిఫ్ట్ అలాగే కిందికి వెళ్లింది.
ఇది గమనించిన స్కూల్ సిబ్బంది ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే జెనెల్ ఫెర్నాండెజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహటీన ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.