బుధవారం, 5 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 ఆగస్టు 2025 (09:31 IST)

సూళ్లూరుపేటలో వెలుగు చూస్తున్న లేడీ డాన్ అరుణ అకృత్యాలు...

lady don aruna
నెల్లూరు జిల్లా జిల్లాకు చెందిన లేడీ డాన్ అరుణ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గత వైకాపా ప్రభుత్వంలో వైకాపా ప్రజా ప్రతినిధులు, అధికారులను అడ్డుపెట్టుకుని ఆమె సాగించిన సెటిల్మెంట్లు, దందాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో బయటపడుతున్నాయి. నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన ఆమె.. పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసులతో కలిసి తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తోంది. 
 
వైకాపా హయాంలో నాటి సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో సన్నిహితంగా మెలిగిన అరుణ.. భార్యాభర్తల గొడవలపై గెస్ట్‌హౌస్, లాడ్జీల్లో పంచాయితీలు చేసి వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఆమె 2024 సార్వత్రిక ఎన్నికల్లో సూళ్లూరుపేట నుంచి అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. నాయుడుపేట మండలం పండ్లూరులోని ఓ హోటల్లో గదులు అద్దెకు తీసుకుని ఎన్నికల ప్రచారం తీరుతెన్నులను పర్యవేక్షించారని తెలిసింది.
 
ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే వారిక్కడ మకాం వేసినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ కేంద్రంలో ఆమె తరపున చీఫ్ ఏజెంట్‌గా సూళ్లూరుపేట ఎంపీపీ, వైకాపా నేత అల్లూరు అనీల్ రెడ్డిని నాటి ఎమ్మెల్యే సంజీవయ్య నియమించారని తెలిసింది. ఈ అనిల్ రెడ్డి క్రికెట్ బెట్టింగ్ కేసులో నిందితుడు. బెంగళూరు బెట్టింగ్ డాన్ కిరణ్‌ సింగ్‌కు అత్యంత సన్నిహితుడుగా ముద్రవుంది. అప్పటి నెల్లూరు ఎస్పీ పీహెచ్ రామకృష్ణ ఆయన బృందాన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత కూడా ఈ ముఠా గంజాయి, గుట్కా వ్యాపారాలు చేసేదని ఆరోపణలున్నాయి.