గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 మే 2024 (13:51 IST)

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

crime
గర్భంతో ఉన్న ఓ శునకాన్ని ఓ కసాయి వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణ ఘటం గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. అమరావతి రోడ్డులో అన్నపూర్ణ నగర్ 7వ లైను వద్ద సితార చికెన్ అండ్ మటన్ స్టాల్లో గొర్లపాలేనికి చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. 
 
శుక్రవారం అర్థరాత్రి తర్వాత అతడు కడుపుతో ఉన్న ఓ వీధి కుక్కను పలుమార్లు కత్తితో పొడిచి చంపేశాడు. అటుగా వెళుతున్న హేమంత్ అనే వ్యక్తి అతడిని నిలువరించే ప్రయత్నం చేసినా లెక్క చేయకుండా కుక్కను చంపి రోడ్డు మీదకు లాక్కొచ్చి పడేశాడు.
 
ఘటనపై స్థానిక బ్లూ క్రాస్ విభాగం కార్యదర్శి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు గోపీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం చికెన్ స్టాల్లో కోడిని ఓ కుక్క చంపి తినేసింది. 
 
దీంతో, దుకాణ యజమాని ఆ మొత్తాన్ని అతడి జీతంలో మినహాయించాడు. ఇందుకు ఆ కుక్కే కారణమని భావించిన గోపీకృష్ణ దాన్ని దారుణంగా పొట్టనపెట్టుకున్నాడు. మూగజీవాన్ని కర్కశంగా మట్టుపెట్టిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.