సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (19:05 IST)

ప్రేమించలేదని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు ... ఎక్కడ?

murder
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో దారుణం జరిగింది. తనను ప్రేమించలేదన్న అక్కసుతో ఒక యువతిని యువకుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణ ఘటన బెంగూళూరు శివారుల్లోని ఓ ప్రైవేటు యూనివర్శిటీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
లయ స్మిత అనే 19 యేళ్ల యువతి కాలేజీలో బీటెక్ విద్యాభ్యాసం చేస్తుంది. అలాగే, పవన్ కళ్యాణ్ అనే 21 యేళ్ల యువకుడు బీసీఏ చదువుతున్నాడు. వీరిద్దరిదీ ఒకే ఊరు కావడంతో గత కొంతకాలంగా వీరిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు. పైగా, బంధుత్వం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆమెను పెళ్లి చేసుకోవాలని పవన్ భావించాడు. ఇందుకు స్మిత అంగీకరించలేదు. పైగా, ఆ యువతి కుటుంబం కూడా ససేమిరా అన్నారు. తన కుమార్తెపై ఆశలు పెట్టుకోవద్దని పవన్‌కు హెచ్చరించారు. 
 
ఈ నేపథ్యంలో స్మితపై కక్ష పెంచుకున్న పవన్... ఆమెను చంపాలన్న నిర్ణయానికి వచ్చి, ఆమె చదువుతున్న కాలేజీకి వెళ్లి అక్కడ కొద్దిసేవు ఆమెతో మాట్లాడారు. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వివాదం కూడా జరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పవన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడవడంతో ఆమె అక్కడే రక్తపు మడుగులో పడిపోయింది. ఆ తర్వాత పవన్ కూడా అదే కత్తి తనకు తాను పొడుచుకున్నాడు. వీరిద్దరినీ ఆస్పత్రికి తరలించగా, స్మిత మరణించినట్టు వైద్యులు నిర్ధారించగా, పవన్‌కు చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.