గ్రేట్ లేక్స్‌లో బాంబ్ సైక్లోన్... మంచు తుఫాను దెబ్బకు 34 మంది మృతి
అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను ముంచెత్తింది. ఈ తుఫాను దెబ్బకు అమెరికా వణికిపోతోంది. ముఖ్యంగా, గ్రేట్ లేక్స్ ప్రాంతంలో బాంబ్ సైక్లోన్ ఏర్పడింది. ఈ ముంచు తుఫాను కారణంగా ఇప్పటివరకు 34 మంది చనిపోయారు. మరికొందరు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు.
ఇళ్ళ పైకప్పులతో ఇంటి పరిసరాల్లో రెండు అడుగులు మేరకు మంచు పేరుకుపోయింది. ఈ కారణంగా అమెరికా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా, న్యూయార్క్ నగరంలో మరింత దారుణమైన పరిస్థితులు నెలకొనివున్నాయి.
చాలా ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తుంది. దీంతో అత్యవసర సేవలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగునీటిని కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది.
బాధితులను ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సులు వచ్చే సమయం మూడు గంటలకుపైగా పడుతోంది. ప్రభుత్వ గ్రంథాలయాలు, పోలీస్ స్టేషన్లను తాత్కాలిక శిబిరాలుగా మార్చారు. బఫెలో ప్రాంతంలో లక్షమందికి పైగా విద్యుత్ సరఫరా లేక అల్లాడిపోతున్నారు. కెనడాలో మరో 1.50 లక్షల మంది యుటిలిటీ వినియోగదారులకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
ఒంటారియాలో, క్యుబెక్ వంటి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మంచు తుఫాను దెబ్బకు క్రిస్మస్‌కు రెండు రోజులు ముందుగానే ఆరు వేల విమానాలను రద్దు చేశారు. అంతకుముందు అంటే గురువారం దాదాపు మూడు వేల విమానాలను రద్దుచేశారు. అగ్రరాజ్యం అమెరికాలో 60 శాతం ప్రాంతాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొనివుంది.