ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 9 నవంబరు 2023 (12:30 IST)

ఆస్తి కోసం అక్కను చంపేశాడు.. ఎక్కడ?

knife
ఆస్తి కోసం అక్కను చంపేశాడో సోదరుడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... పట్టణంలోని సీతారాంపురానికి చెందిన స్వరూపారాణి ఈ నెల 5వ తేదీన తలకు తీవ్ర గాయమై ముఖం, ఛాతి పాక్షికంగా కాలిపోయి స్నానపు గదిలో రక్తపు మడుగులో పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించింది. పెన్ పహాడ్ మండలం అనాజిపురం గ్రామానికి చెందిన రాజకుమార్ తన చెల్లెలు స్వరూపారాణి వద్ద పదేళ్ల క్రితం తన తండ్రి పేరున ఉన్న మూడు వందల గజాల ప్లాట్ దస్త్రాలు కుదువపెట్టి రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు ఇస్తానని ప్లాట్ కాగితాలు తిరిగి ఇవ్వాలంటూ ఆరు నెలలుగా తన చెల్లెలును అడుగుతున్నాడు. 
 
తండ్రి సంపాదించిన ఆస్తిలో తనకూ సమాన వాటా ఉంటుందని, ఇచ్చిన డబ్బులకు వడ్డీ లెక్క కడితే నీ వాటాకు లెక్క సరిపోతుందని స్వరూపారాణి బదులు చెబుతూ వస్తోంది. ప్లాట్ కాగితాలు ఇవ్వకపోవడంతో చెల్లెలుపై కోపం పెంచుకున్న రాజకుమార్ ఆమెను హత్య చేసి కాగితాలతోపాటు ఆమె వద్దనున్న బంగారాన్ని అపహరించాలని నిర్ణయించుకున్నాడు. అందులోభాగంగా ఈ నెల 5వ తేదీ సాయంత్రం సీతారాంపురంలోని స్వరూపారాణి ఇంటికి వెళ్లి ఆమె ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకొని ఇనుప కడ్డీతో తలపై విచక్షణారహితంగా కొట్టాడు. 
 
ఆమె మెడ మీద ఉన్న పుస్తెలతాడు తీసుకొని, అక్కడున్న వస్త్రాలకు నిప్పంటించి ఆమె ముఖంపై వేసి, విద్యుదాఘాతంతో మృతిచెందినట్లు నమ్మించాలని ప్రయత్నించాడు. అనంతరం అక్కడి నుంచి తిరిగి స్వగ్రామం వెళ్లాడు. హత్య జరగడానికి ముందు రాజకుమార్ మృతురాలి ఇంటికి వచ్చి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వివరించారు.