ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2024 (11:51 IST)

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. దళిత నర్సుపై వైద్యుడి అఘాయిత్యం

victim woman
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దళిత నర్సుపై వైద్యుడు ఒకడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యూపీలోని మొరాదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. దీనిపై బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
పోలీసుల కథనం మేరకు.. మొరాదాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో దళిత యువతి(20) గత ఏడు నెలలుగా నర్సుగా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగానే ఆదివారం రాత్రి 7 గంటలకు విధులకు హాజరైంది. అదే ఆస్పత్రిలో పనిచేసే మరో నర్సు మెహనాజ్.. డాక్టర్ షానవాజ్ గదిలోకి వెళ్లాలని యువతికి సూచించగా ఆమె నిరాకరించారు. దీంతో మెహనాజ్‌‍తో పాటు జునైద్ అనే వార్డుబాయ్ ఆమెను ఆసుపత్రి పై అంతస్తులోని గదిలోకి బలవంతంగా తీసుకెళ్లి బయటి నుంచి తాళం వేశారు.
 
ఆ తర్వాత గదిలోకి ప్రవేశించిన వైద్యుడు షానవాజ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని గ్రామీణ ఎస్పీ సందీప్ కుమార్ మీనా తెలిపారు. బాధితురాలిని చంపుతానని నిందితుడు బెదిరించాడని, కులం పేరుతో దూషించాడని వివరించారు. షానవాజ్‌తో పాటు నర్సు మెహనాజ్, వార్డుబాయ్ జునైద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సాయంత్రం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఆసుపత్రిని తనిఖీ చేసి సీజ్ చేశారు.