శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 మే 2023 (10:03 IST)

హత్య కేసులో వైకాపా ఎంపీ నందిగం సురేష్ బావ అరెస్టు

arrest
ఓ హత్య కేసులో అధికార వైకాపాకు చెందిన ఎంపీ నందిగం సురేష్ బాబును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని అమరావతి గ్రామమైన ఉద్దండరాయునిపాలెంలో ఏప్రిల్ 21వ తేదీన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం గ్రామానికి చెందిన మెడబలిమి ఆది నరసింహులు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో లభించిన ప్రాథమిక సాక్ష్యాధారాల ఆధారంగా బాపట్ల వైకాపా ఎంపీ నందిగం సురేష్‌ బావ ప్రత్తిపాటి వెంకటరత్నంను పోలీసులు అరెస్టు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసుల కథనం మేరకు.. ఆది నరసింహులు ఆరేళ్ల కిందట తన భార్యతో కలిసి ఉద్దండరాయునిపాలెం వచ్చి ఉంటున్నారు. తన భార్యతో వెంకటరత్నం అనే వ్యక్తి చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో గత నెల 21న నరసింహులు తాగిన మైకంలో రత్నంతో ఘర్షణ పడ్డాడు. ఆ సమయంలో నరసింహులు కింద పడిపోయారు. అదేసమయంలో నిందితుడు కాలితో నరసింహులు వృషణాలపై బలంగా కొట్టగా స్పృహ కోల్పోయారు. 
 
కొన ఊపిరితో ఉన్న నరసింహులు ఛాతీపై బలంగా గట్టిగా నొక్కడంతో అతను ప్రాణాలు కోల్పోయారు. పోస్టుమార్టం నివేదికలోనూ వృషణాలపై వాపు ఉందని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గత నెల 27న వెంకటరత్నంను అరెస్టు చేసి విచారించారు. గత నెల 28న మంగళగిరి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.