శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 1 మే 2023 (13:40 IST)

పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటే ఆర్నెల్లు వేచి ఉండక్కర్లేదు : సుప్రీంకోర్టు

divorce
విడాకుల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలం తీర్పును వెలువరించింది. ఈ మేరకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. భార్యాభర్తలు కలిసి జీవించలేని పరిస్థితుల్లో వారికి వెంటనే విడాకులు మంజూరు చేయొచ్చని తెలిపింది. ముఖ్యంగా పరస్పర అంగీకారంతో దంపతులు విడిపోవాలని భావిస్తే, అందుకు ఆరు నెలలు ఆగాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే, ఈ ఆరు నెలల నిరీక్షణ నిబంధనను కొన్ని షరతులతో సడలించింది. 
 
'దంపతుల మధ్య వివాహ బంధం కోలుకోలేని విధంగా విచ్ఛినమైతే.. ఆ కారణం కింద వారి పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేయడం ఈ కోర్టుకు సాధ్యమే. ఆర్టికల్‌ 142 కింద విస్తృత అధికారాలను ఉపయోగించుకుని సుప్రీంకోర్టు వారికి విడాకులు మంజూరు చేయొచ్చు. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటే.. అందుకోసం ఆరు నెలలు ఆగాల్సిన అవసరం లేదు. కొన్ని షరతులతో ఈ తప్పనిసరి నిరీక్షణ గడువును ఎత్తివేయొచ్చు' అని జస్టిస్‌ ఎస్‌.కే. కౌల్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
 
కుటుంబ న్యాయస్థానాలకు రిఫర్‌ చేయకుండానే సుప్రీంకోర్టు నేరుగా విడాకులు మంజూరు చేసే అంశంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పరస్పరం ఇష్టపూర్వకంగా విడాకులు కోరుకునే వారి విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 పరిధిలోని విస్తృత అధికారాలను వినియోగించుకునే వీలుందా అనే  దానిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఐదేళ్ల క్రితం 2016 జూన్‌ 29న ఈ పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. కొన్నేళ్ల పాటు విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. గతేడాది సెప్టెంబరులో తీర్పు రిజర్వ్‌ చేసింది. తాజాగా సోమవారం తీర్పు వెలువరించింది.