1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2023 (22:06 IST)

అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే...?

avinash reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి భవితవ్యం మంగళవారం తేలిపోనుంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై తుది తీర్పును తెలంగాణ హైకోర్టు మంగళవారం వెలువరించనుంది. ఈ తీర్పులో అవినాష్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఒక వేళ ముందస్తు బెయిల్ ఇస్తే మాత్రం కేసు మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. పైగా, ఈ కేసులోని సాక్ష్యాధారాలన్ని మాయం చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
కాగా, అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ అవినాష్ రెడ్డికి చుక్కెదురైంది. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు ఆలకించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పక్కనపెట్టింది. పైగా, విచారణను లిఖిత పూర్వకంగా ప్రశ్నలు ఇవ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించడాన్ని కూడా సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 
 
సుప్రీంకోర్టు తాజా తీర్పుతో మంగళవారం వరకు అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన రక్షణ తొలగిపోయినట్టయింది. దీంతో అవినాష్‌ను అరెస్టు చేసేందుకు సీబీఐ రంగం చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా, ఇప్పటివరకూ ఇలాగే విచారణ జరగాలి, మేం చెప్పినట్టు విచారించాలి, ముఖ్యంగా, ఏమేం అడుగుతారో ప్రశ్నలు ఇవ్వాలి అని న్యాయస్థానాలు తీర్పులిచ్చిన సందర్భాలు గతంలో లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇపుడు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా? లేకుంటే అరెస్టు చేసుకోవచ్చని న్యాయస్థానం కూడా చెబుతుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 
 
ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే సీబీఐ దూకుడుకు కళ్లెం పడినట్టేనని, కేసు అసలు ముందు సాగే అవకాశమే ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ లోపు సాక్ష్యాధారుల కూడా తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయని వారు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే వివేకా హత్య కేసులో ఖచ్చితమైన సాక్ష్యాధారాలు ఇవేనని ఓ వైపు సునీత, మరోవైపు, సీబీఐ అధికారులు ఘంటా పథంగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో వేచి చూడాల్సిందే.