బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By వాసుదేవన్
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (11:13 IST)

వైకాపా ఎవరిది... జగన్‌దా... శివకుమార్‌దా...???

అసలే ఈడీ నోటీసులు వాటికి సంబంధించిన అనేక కోర్టు హాజరీలతో తల మునకలవుతున్న వైకాపా అధ్యక్షుడు జగన్‌కి ఇప్పుడు మరో నోటీసు కూడా వచ్చింది... కాకపోతే ఇది ఎలక్షన్ కమీషన్ నుండి వచ్చింది.
 
సంబంధిత వివరాలలోకి వెళ్తే... వాస్తవానికి గతంలో వైఎస్సార్‌సీపీ (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ)ని తెలంగాణకి చెందిన శివకుమార్ ఏర్పాటు చేయడం జరిగింది.

కాగా తన తండ్రి పేరు కలిసి వస్తూండడంతో జగన్ ఆ పార్టీని తన ఆధీనంలోకి తెచ్చుకొని తాను అధ్యక్షుడిగా, తన తల్లి విజయమ్మని గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడైన శివకుమార్‌ని పార్టీ తెలంగాణ విభాగం జనరల్ సెక్రటరీగా నియమించారు.
 
కాగా... తెలంగాణ ఎన్నికల సమయంలో వైఎస్‌ దుర్మార్గుడని కేసీఆర్ విమర్శించడంతో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయవద్దని శివకుమార్ పిలుపునిస్తూ తమ పార్టీ తరఫున అభ్యర్థులెవ్వరూ లేనందున, వైఎస్ మరణించే వరకూ ఉండిన కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయమని కోరుతూ ప్రతికా ప్రకటన విడుదల చేసారు.

అయితే ఈ వ్యవహారం తనకు తెలియకుండా ఈ వ్యవహారం జరగడంతో జగన్ సీరియస్ అయ్యారు. దీంతో పార్టీ నుంచి శివకుమార్‌ను పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరిస్తూ ఆ పార్టీ పత్రికా ప్రకటన జారీ చేసింది. 
 
తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. జగన్‌కు తనను సస్పెండ్ చేసే అధికారం లేదని, పార్టీ తనదేనని వాదించారు. పార్టీ వ్యవస్థాపక నిబంధనలను జగన్‌ పక్కన పెట్టారని శివకుమార్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి పార్టీని తిరిగి తనకు అప్పగించాలని కోరారు.
 
మొత్తం మీద వైకాపా ఎవరి చేతికి చిక్కబోతోందో వేచి చూడాల్సిందే...