వామ్మో... భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం... ఆగస్టు 10న భూమిని తాకితేనా?

asteroid
Last Modified మంగళవారం, 6 ఆగస్టు 2019 (17:39 IST)
'ఆస్టరాయిడ్ 2006 క్యూక్యూ 23' అని పిలువబడే ఒక గ్రహశకలం భూమి వైపు వేగంగా దూసుకు వస్తోంది. ఇది ఆగస్టు 10న భూమికి చేరువగా వస్తుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహ శకలం సైజు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే పెద్దదిగా వుందనీ, అది కనుక భూమిని తాకినట్లయితే, ఆ ప్రాంతంలో భారీ వినాశనాన్ని కలిగిస్తుందంటున్నారు.

నాసా అంచనా ప్రకారం, గ్రహశకలం 2006 క్యూక్యూ 23 భూమి నుండి 4.55 మిలియన్ మైళ్ళ మేర దగ్గరగా వస్తుంది. ఈ దూరం మనకు చాలా ఎక్కువగానే వుందని అనిపించినప్పటికీ, విశ్వం యొక్క విస్తీర్ణాన్ని బట్టి పరిశీలిస్తే ఇది చాలా చాలా తక్కువ దూరం. ఐతే ఈ గ్రహశకలం శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూమికి ఎలాంటి ప్రమాదం కలిగించకుండా దాటిపోతుంది, కానీ దాని గమనంలో ఏదైనా మార్పు వచ్చినట్లయితే అది మన భూమిపై పడే అవకాశం వుంటుంది.

గ్రహశకలం 2006 క్యూక్యూ 23ను భూమికి సమీపంలో ఉన్న వస్తువుగా నాసా చెపుతోంది. అంతరిక్ష సంస్థ ప్రకారం, 1.3 ఖగోళ యూనిట్ల (AU) దూరంలో సూర్యుని కక్ష్యలో ఉన్న ఏదైనా అంతరిక్ష వస్తువు భూమికి సమీపంలో ఉన్న వస్తువుగానే పరిగణించబడుతుంది. ఒక AU సుమారు 92.95 మిలియన్ మైళ్ళకు సమానం. ఐతే ఇది వాస్తవానికి భూమి మరియు సూర్యుడి వున్న మధ్య దూరం.

నాసా అంచనా ప్రకారం, సూర్యుని చుట్టూ భూమి చుట్టూ ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ వ్యాసం కలిగిన 900 గ్రహ శకలాలు ఉన్నాయి. ఈ జాబితాలో అతిపెద్దది 34 కిలోమీటర్ల వ్యాసం వున్న ఓ గ్రహశకలం. ఇలాంటి గ్రహ శకలాలు ఎప్పుడు ఎలా భూమి పైకి వచ్చి పడుతాయోనని నాసా ఇప్పుడు గ్రహాల రక్షణ ఆయుధాలను అభివృద్ధి చేయడంలో బిజీగా ఉంది. వీటిని తయారుచేసి భూ గ్రహానికి ఏవైనా గ్రహ శకలాలు సమీపించి ఢీకొట్టే పరిస్థితి వుంటే వాటిని దారి మళ్లించడమో లేదంటే అంతరిక్షంలోనే నాశనం చేయడమో చేస్తాయి.

ఇదిలావుంటే, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త నీల్ డి గ్రాస్సే టైసన్ చెపుతూ ఓ భారీ ఉల్క భూమిని ఢీకొట్టే అవకాశం వున్నదనీ, దీని కారణంగా ప్రపంచం అంతం జరుగవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి అభిప్రాయాన్నే మరో శాస్త్రవేత్త డాక్టర్ ఇయాన్ మెక్ డొనాల్డ్ కూడా వ్యక్తపరిచారు. భూమిని ఉల్కలు ఢీకొనడం కొత్తేమీ కాదనీ, గతంలో కూడా ఇలాంటి భీకరమైన విస్ఫోటనాలు జరిగాయనీ, అలాంటి పరిస్థితుల్లో భూమిపై నష్టం భారీ జరిగిందని చెప్పుకొచ్చారు. ఐతే నాలుగింట మూడొంతులు నీళ్లు వున్న భూమిపై ఎక్కువగా నీటి భాగంలో పడటం వల్ల జీవులు బ్రతికిపోతున్నాయంటూ వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :