శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (10:18 IST)

కాపురాల్లో 'సాఫ్ట్' చిచ్చు.. విడిపోతున్న టెక్కీ దంపతులు

పచ్చని కాపురాల్లో టెక్నాలజీ కూడా చిచ్చుపెడుతోంది. సాఫ్ట్‌‌వేర్‌‌ జంటల్లో భార్యాభర్తలిద్దరూ ప్రైవసీ కోరుకుంటున్నారు. ఎవరి ఫోన్లు వారివి.. ఎవరి సర్కిల్ వారిది. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఒకరి ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ఇంకొకరు చూసినా గొడవలైపోతున్నాయి. ఫోన్ తీసుకొని వాట్సాప్ చూశారని, ఫేస్‌బుక్‌‌లో తన ఫ్రెండ్ లిస్ట్‌‌ను చెక్ చేసి తన గురించి డిటెయిల్స్ కనుక్కున్నారన్న కారణాలతో కూడా విడాకుల వరకు వెళ్తున్న కేసులూ ఉన్నాయి.
 
గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో తీసుకుంటున్న టెక్కీ దంపతుల సంఖ్య పెరిగిపోతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే... హైదరాబాద్, రంగారెడ్డి కోర్టుల్లో గతేడాది సుమారు 8 వేల విడాకుల కేసులు నమోదయ్యాయి. ప్రతీ యేడాది 500 చొప్పున పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఫ్యామిలీ కోర్టుల్లో రోజుకు ఐదు కేసుల చొప్పున నమోదవుతుంటే.. వీటిలో ఎక్కువగా సాఫ్ట్‌‌వేర్‌‌కు చెందిన జంటల కేసులే ఉండటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 
 
ఒక నెలకు నమోదవుతున్న వంద కేసుల్లో 60 నుంచి 70 కేసులో వీరివే ఉన్నాయి. ప్రధానంగా మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్‌‌పల్లి వంటి ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్‌లలో కూడా ఈ తరహా కేసులో ఎక్కువగా నమోదవుతున్నాయి. కోర్టుల వరకు వెళ్లాక డ్రాప్ అవుతున్న కేసులు 10 శాతం లోపు ఉంటున్నాయి. విడాకులు కోసం ముందుకొస్తున్న జంటల్లో 30 నుంచి 40 శాతం వరకూ విడాకులు తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. 
 
మరికొన్ని కేసులు కౌన్సిలింగ్ వద్ద ఆగిపోతున్నాయి. కౌన్సిలింగ్ పుణ్యమాని కొందరు టెక్కీలు తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు. ఇక్కడ రాజీ పడనివారు కోర్టు వరకూ వెళ్తున్నారు. మరికొందరు విడాకులుకాకుండా జ్యుడిషియల్ సెపరేషన్ ఆప్షన్ ఎంచుకుంటున్నారు. అంటే వారు భార్యభర్తలుగానే ఉంటూనే రెండు నుంచి ఐదేళ్ల వరకు విడివిడిగా ఉంటారు. ఈ ఆప్షన్‌‌ను ఎక్కువగా మగవాళ్లే కోరుతున్నారు. తర్వాత నచ్చితే కలిసి ఉంటారు లేదంటే విడాకులు తీసుకుంటున్నారు.